వెల్‌కమ్
గ్రాండ్
● జిల్లాలో న్యూ ఇయర్ సంబరాల జోష్ ● స్వయంభూ విఘ్నేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ● విద్యుద్దీపాలంకరణలతో ఆలయాలు, చర్చిల ముస్తాబు ● నేలపై వెల్లివిరిసిన ఇంద్ర ధనుస్సులా రంగవల్లులతో మెరిసిన వీధులు
ప్రభుత్వ ఉద్యోగ సాధనే లక్ష్యం
నేను ఫిజిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్. ప్రస్తుతం యలమంచిలిలో ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నాను. అమ్మానాన్న వ్యవసాయం చేస్తూ నన్ను పీజీ వరకు ఎంతో కష్టపడి చదివించారు.వారి కష్టానికి తగ్గట్టు చదువుకున్నాను. ఈ ఏడాది ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి. అప్పుడే నాలాంటి నిరుద్యోగులందరికీ ప్రయోజనం కలుగుతుంది.
–కటారి పద్మ, ప్రైవేటు కళాశాల అధ్యాపకురాలు, యలమంచిలి
కొంగొత్త బాసలతో
ఆశల పల్లకిలో కొత్త సంవత్సరానికి యువత స్వాగతం పలికింది. 2024సంవత్సరానికి వీడ్కోలు చెప్పి 2025కు స్వాగతం చెబుతూ వివిధ కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్ధులు నూతన సంవత్సర వేడుకలు జరుపుకొన్నారు. అర్ధరాత్రి కేక్‌లు కట్ చేసి, బాణాసంచా వెలుగుల్లో సంబరాలు జరిపారు. కోటి ఆశలతో కొత్త ఏడాది కోసం కొంగొత్త బాసలు చేసుకున్నారు.
క్యాలెండర్ మారిపోయింది...
టిక్ టిక్..మన్న గడియారం పన్నెండో గంట కొట్టగానే నేడు రేపు సంధిలో కాలం కదలకుండా ఆగిపోయింది.. న్యూ ఇయర్ జోష్ అంబరాన్ని అంటింది...
‘ఉందిలే మంచి కాలం ముందుముందునా...’ అంటూ ఆశావహ దృక్పథంతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం.
గడిచిన సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ కోటి ఆశలతో కొత్త సంవత్సరానికి ప్రజలంతా స్వాగతం పలికారు. నేలపైనే ఇంద్ర ధనస్సులు వెల్లి విరిసినట్టుగా రంగు రంగుల రంగవల్లులతో వీధులన్నీ ముస్తాబయ్యాయి. చర్చిలను, దేవాలయాలను ప్రత్యేక విద్యుత్ అలంకరణలతో ముస్తాబు చేశారు. మంగళవారం అర్థరాత్రి 12 గంటల వరకు జిల్లాలో పలు చోట్ల ఘనంగా సాంస్కృతిక సంబరాలు జరుపుకొన్నారు. చోడవరం స్వయంభూ విఘ్నేశ్వరస్వామి ఆలయంలో భక్తులకు ప్రత్యేక దర్శనాలు కల్పించారు. పండ్ల దుకాణాలు, స్వీట్‌స్టాళ్లు, బేకరీలు, పూల దుకాణాలు, గ్రీటింగ్ షాపులు, ఆఫర్లతో బిర్యానీ దుకాణాలు, రెస్టారెంట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి.
– తుమ్మపాల,
దేవరాపల్లి, చోడవరం, యలమంచిలి
●
నిరాశ నుంచి ఆశ ల్లోకి...
గడచిన సంవత్సరం కొందరికి సుఖం, మరికొందరికీ దుఃఖం మిగిల్చింది. కష్టాలు, నష్టాలు, నిరాశలో వున్నవారు డీలా పడిపోకుండా, భవిష్యత్ చక్కని ఆశలతో వుండాలని ఆకాంక్షిస్తూ, మనోధైర్యంతో న్యూ ఇయర్‌కు స్వాగతం చెప్పాలి. నిత్య నూతన ఆలోచనలు, కార్యాచరణ ప్రణాళికలను ఎవరికి వారే రూపొందించుకుని నిరంతరం శ్రమిస్తే, అద్భుత మైన ఫలాలను కాలం అందజేస్తుంది. అందుకే ఈ కొత్త సంవత్సరం ఆత్మవిశ్వాసంతో నిరంతరం శ్రమించాలని నిర్ణయించుకున్నాను.
–సీహెచ్ నవీన్, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్, పాతవీధి, యలమంచిలి
సుఖసంతోషాలు వెల్లివిరియాలి
ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరంలో అందరి కుటుంబాలలో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, విద్యాపరంగా అభివృద్ధి సాధించాలి. ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల ద్వారా సహాయం పొందుతున్న వివిధ వర్గాల ప్రజలందరూ ఆర్థిక అభ్యున్నతి సాధించాలి. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి నూతన సంవత్సరం మరో మైలురాయి కావాలని ఆకాంక్షిస్తున్నాను.
– విజయ కృష్ణన్, జిల్లా కలెక్టర్
జిల్లా ప్రజలంతా నూతన సంవత్సరంలో ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో సుభిక్షంగా జీవించాలని కోరుకుంటున్నాను. ప్రజలందరికీ, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కొత్త సంవత్సరంలో జిల్లా ప్రజలందరిపై భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.
–బూడి ముత్యాలనాయుడు మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
కొత్త వెలుగులు నిండాలి
Comments
Please login to add a commentAdd a comment