● కొత్తపెంటలో ముగిసిన దేవానంద స్వామీజీ ఆరాధన మహోత్సవం ●
దేవరాపల్లి: మండలంలోని కొత్తపెంటలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న సద్గురు దేవానంద సరస్వతి మహారాజ్ (రిషీకేష్) 25వ ఆరాధన మహోత్సవాలు మంగళవారంతో ఘనంగా ముగిశాయి. దేశ నలుమూలల నుంచి స్వామీజీ భక్తులు, శిష్యులు తరలి రావడంతో ఆశ్రమ పరిసరాలు కిక్కిరిశాయి. తెల్లవారు జాము నుంచి స్వామిజీ విగ్రహాన్ని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. దీంతో ఆశ్రమ పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. సుప్రభాతం, పతాకావిష్కరణ, నగరసంకీర్తన, భగవద్గీత పారాయణ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. 25 మంది స్వామీజీలు, సాధుసంతులకు భక్తులు పాద పూజ చేశారు.
స్వామీజీల ప్రవచనాలతో పులకించిన భక్తులు
రిషీకేష్ నుంచి వచ్చిన పద్మనాభానంద స్వామీజీ మహరాజ్ ఆధ్యాత్మిక ప్రవచనాలు భక్తులను ఆకట్టుకున్నాయి. భీమిలి నుంచి హాజరైన రామకృష్ణానంద, హైదరాబాద్‌కు చెందిన భారతీ తీర్థ, సన్మాన గ్రహీత పశర్లపాటి శ్రీనివాస్ బంగారయ్య శర్మ, బాచంపల్లి సంతోష్‌కుమార్ శాస్త్రి తదితరుల ప్రవచనాలతో భక్తులు పులకించారు.
మాజీ డిప్యూటీ సీఎం బూడి పూజలు
మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు దేవానంద స్వామీజీని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయనను సభా వేదికపై ఆశ్రమ నిర్వాహుకులు ఘనంగా సత్కరించారు.దేవానంద స్వామీజీని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, ఎంపీపీ చింతల బుల్లిలక్ష్మి, జెడ్పీటీసీ కర్రి సత్యం, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, కొప్పల వెలమ కార్పొరేషన్ చైర్మన్ పి.వి.జి. కుమార్, బుచ్చెయ్యపేట జెడ్పీటీసీ దొండా రాంబాబు, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు బూరె బాబురావు, ఎ.కొత్తపల్లి సర్పంచ్ చింతల సత్య వెంకటరమణ, స్థానిక సర్పంచ్ రొంగలి వెంకటరావు తదితరులు దర్శించుకున్నారు. భారీ ఎత్తున అన్నసమారాధన నిర్వహించారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా స్థానిక ఎస్‌ఐ టి.మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సద్గురు దివ్య జీవన ట్రస్ట్ అధ్యక్షుడు రెడ్డి పైడిపునాయుడు, కార్యదర్శి మంత్రిప్రగడ నర్సింహమూర్తి, కోశాధికారి పసగాడ ముత్యాలు, స్థానిక సర్పంచ్ రొంగలి వెంకటరావు, మాజీ సర్పంచ్ రొంగలి శంకరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment