అధికారులు రాలేదని జేపీ అగ్రహారం గ్రామస్తుల ఆగ్రహం
● వాయిదా పడిన రెవెన్యూ సదస్సు
రోలుగుంట: అధికారుల పూర్తిస్థాయిలో హాజరు కాక, అర్జీదారులు అడిగిన సమస్యలపై సరైన సమాధానం లేక జె.పి.అగ్రహారం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సమాధానం లేని రెవెన్యూ సదస్సు ఎందుకని, వాయిదా వేయాలని డిమాండ్ చేయడంతో అధికారులు వెనుదిరిగారు. మండలంలో జె.పి.అగ్రహారంలో రెండు వారాల క్రితం వాయిదా పడిన రెవెన్యూ సదస్సు మరలా మంగళవారం నిర్వహించారు. ఈ సదస్సుకు ఆర్‌ఐ, మండల సర్వేయర్ మాత్రమే హాజరయ్యారు. తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ రాకుండా సదస్సు ఎలా నిర్వహిస్తున్నారని గ్రామస్తులు నిలదీశారు. దీనిపై ఆర్‌ఐ రామూర్తి, సర్వేయర్ తవుటునాయుడు స్పందించి వారు ఇతర సమావేశాలకు వెళ్లారని సమాధానమిచ్చారు. కొంతమంది ఈనాం భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారు. సాగులో ఉండి అర్హతలున్న వారికి ఇంకా పాసు పుస్తకాలు జారీ చేయలేదు. ఇటువంటి కీలక సమస్యలు పరిష్కరించాల్సిన తరుణంలో అధికారులు రాకపోతే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేయడంతో సదస్సు వాయిదా పడింది.
Comments
Please login to add a commentAdd a comment