సినీ ఫక్కీలో గంజాయి రవాణా
● ట్రాక్టర్ తొట్టె కింద రహస్య అరల్లో తరలింపు ● ఆటకట్టించిన చోడవరం పోలీసులు ● అదుపులో ఇద్దరు నిందితులు ● మరింత లోతుగా దర్యాప్తు
పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి
చోడవరం: ట్రాక్టర్ తొట్టె అడుగుభాగంలో రహస్య అరలు..వాటిలో ప్యాకెట్లలో గంజాయి... ఎవరికీ అనుమానం రాకుండా పైన ఖాళీగా తొట్టె ... ఇలా స్మగ్లరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చోడవరం పోలీసులు వారి ఎత్తుగడలను చిత్తు చేశారు. 250 కిలోల గంజాయిని బుధవారం పట్టుకున్నారు. ప్యాకెట్లలో తరలిస్తున్న గంజాయి విలువ సుమారు రూ.15లక్షలు ఉంటుందని అంచనా. చోడవరం శివారు ప్రాంతంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో పెదబయలు నుంచి విశాఖపట్నానికి వెళ్తున్న ట్రాక్టర్ అనుమానాస్పదంగా ఉండడంతో దానిని క్షుణ్ణంగా పరిశీలించారు. ట్రాక్టర్ కింద భాగంలో ఏర్పాటు చేసిన అరల్లో ఐదు కిలోల చొప్పున ప్యాక్ చేసి ఉన్న 50 గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. ట్రాక్టర్, గంజాయిని స్వాధీనం చేసుకుని, పెదబయలుకు చెందిన నిందితులు చిన్నారావు, త్రిమూర్తులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పూర్తి వివరాల కోసం చోడవరం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే సినీ ఫక్కీలో ప్రత్యేకంగా తయారు చేసిన ట్రాక్టర్‌పై గంజాయి రవాణా చేయడం వెనుక ఇంకా ఎంతమంది ఉన్నారు, బడాబాబులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది. ఈ కేసును పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment