బడిలో రాజకీయ పాఠాలా?
దేవరాపల్లి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో రాజకీయ, మత, వివాహ కార్యక్రమాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. సెలవు రోజుల్లో సైతం ఈ తరహా కార్యకలాపాలు నిర్వహణకు అనుమతి ఇవ్వరాదని విద్యాశాఖ అధికార్లకు స్పష్టం చేసింది. ఈ మేరకు గత ఏడాది నవంబర్‌లో జీవో సైతం జారీ చేసింది. అయితే ఆ జీవోకు కూటమి పార్టీ నేతలే తూట్లు పొడుస్తున్నారు. దేవరాపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సంబరాలు పేరిట మంగళవారం రాజకీయపరమైన కార్యక్రమంతో పాటు పాఠశాల ఆవరణలోనే కోళ్ల పందెం ఏర్పాటు చేయడం వివాదస్పదంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన వేడుకల్లో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పాల్గొనడంపై మరింత దుమారం రేగింది. పాఠశాల భవనాలన్నింటికి రాజకీయ నాయకులతో కూడిన ఫ్లెక్సీ, బ్యానర్లను సైతం అతికించి రాజకీయాలకు వేదికగా మార్చడం పట్ల ప్రజా సంఘాలు, విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోకు విరుద్ధంగా ప్రైవేటు కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు.
మంత్రి లోకేష్ జీవోను అమలు చేసి తీరు ఇదేనా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. అలాంటప్పుడు జీవోలు జారీ చేయడం ఎందుకంటూ బాహాటంగా విమర్శిస్తున్నారు. కూటమికి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు పాఠశాల ఆవరణలో రాజకీయ కార్యక్రమంతో పాటు బహిరంగంగా కోళ్ల పందెం నిర్వహించగా, ఇకపై ప్రతీ గ్రామంలో ఇదే పంథాలో నాయకులు, కార్యకర్తలు పయనించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇదేనా జీవో అమలు తీరు..
కూటమి నేతల ఫ్లెక్సీలు, కోడి పందేల నిర్వహణపై సర్వత్రా నిరసన
Comments
Please login to add a commentAdd a comment