ఘనంగా ముగిసిన ధనుర్మాసోత్సవాలు
నక్కపల్లి: ప్రాచీన పుణ్యక్షేత్రం ఉపమాక శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా ముగిశాయి. నెలరోజులపాటు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాలు మంగళవారం తిరువీధి సేవలతో ముగిశాయని ఆలయప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాద్ తెలిపారు. ఉదయం కొండపై, కొండ దిగువన గల ఆలయాలు, ఉపాలయాల్లో అర్చక బృందం అభిషేకాలు, నిత్యపూజలు ధూపదీప నైవేద్యాలు విశేష హోమాలు, నిత్యసేవాకాలములు నిర్వహించారు. అనంతరం గోదాదేవి అమ్మవారి పుష్పతోటలో నీరాట ఉత్సవాలలో భాగంగా విశేష ఆరాధనలు నివేదనలు, సేవాకాలము నిర్వహించిన తర్వాత 30వ పాశురాన్ని విన్నపం చేశారు. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం కావడంతో సంక్రాంతినాడు ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారి మూలవిరాట్‌కు తెల్లవారు జామున పంచామృతాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. కొండ దిగువన వేణుగోపాల స్వామి ఆలయంలో, ఆండాళ్లమ్మవారి సన్నిధిలోను స్వామివారు ఉత్సవమూర్తుల వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం సంక్రాంతి పండగ సందర్భంగా పద్మావతి, అలువేలుమంగా సమేతుడైన వేంకటేశ్వరస్వామి వారిని ఆంజనేయవాహనంలోను,గోదాదేవి అమ్మవారిని రాజాధిరాజవాహనంలోను వేంచేయింపజేసి గ్రామ మాడవీధుల్లో తిరువీధి సేవలు నిర్వహించారు.రాపత్తు అధ్యయనోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు మంగళవారం ఉభయ దేవేరులతోకూడిన స్వామివారి ఉత్సవమూర్తులను రాజాధిరాజ వాహనంలో అధిష్టింపజేసి తిరువీధి సేవ నిర్వహించారు. మకర సంక్రాంతి, ఉత్తరాయణపుణ్యకాలం ప్రారంభం కావడంతో వివిధ ప్రాంతాలనుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment