సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో సస్పెండైన స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ) కానిస్టేబుల్ పల్లా గంగరాజు వ్యవహారం వెనుక ఓ ఏసీపీ ఉన్నట్టు చర్చ జరుగుతోంది. సదరు ఏసీపీ ద్వారానే వ్యవహారాలన్నీ ఈ కానిస్టేబుల్ చక్కబెడుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా కూటమి ఎమ్మెల్యేల పాత్రపైనా ఇప్పటికే పలు ఫిర్యాదులు వచ్చినట్టు సమాచారం. ప్రధానంగా అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకు బంధువు, పీఏగా చెప్పుకుంటున్న ఓ వ్యక్తికి ఉన్న లింకులపైనా కూడా ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు మొన్నటి వరకు అనకాపల్లిలో విధులు నిర్వహించిన ఈ కానిస్టేబుల్.. ఏసీపీ ద్వారానే బదిలీ చేసుకుని విశాఖ సిటీకి వచ్చినట్టు సమాచారం. మొత్తంగా క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో కానిస్టేబుల్ సెల్ నంబరు ద్వారా జరిపిన లావాదేవీలన్నీ గుర్తించే పనిలో పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు.
అంతేకాకుండా కేవలం కానిస్టేబుల్ అకౌంటు ద్వారా లక్షల్లో లావాదేవీలు జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు కానిస్టేబుల్ ద్వారా నిరంతరాయంగా సంభాషిస్తూ.. ప్రతి నెలా మామూళ్లు దండుకుంటున్న ఓ ఎమ్మెల్యేతో పాటు మరో ఎమ్మెల్యే పీఏ వ్యవహారం కూడా త్వరలో బయటపడే అవకాశం ఉందని విశ్వసనీయవర్గాల సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment