జాతరలో చల్ చల్ గుర్రం!
చోడవరం : జిల్లాలో క్రీడా స్ఫూర్తితో నిర్వహించే గుర్రాల పరుగు పోటీలు సంక్రాంతి తీర్ధాల్లో ప్రత్యేక ఆకర్షణ. గ్రామదేవతల పండగల వరకు అన్ని ఉత్సవాలు గుర్రాల జాతరను తలపిస్తాయి. కొందరు పోటీల కోసమే గుర్రాల పెంపకం చేపడుతుండడం విశేషం. జైపూర్ మహారాణి పాలనలో మాడుగులలో దసరా రోజున ప్రత్యేకంగా గుర్రాల సంత కూడా జరిగేది. ఏజెన్సీ గిరిజన ప్రాంతాలకు వెళ్లేందుకు మైదాన గిరిజన గ్రామాలకు చెందిన వారు నేటికీ గుర్రాలనే రవాణాకు ఉపయోగిస్తున్నారు. దీంతో మైదాన గిరిజన గ్రామాల్లో వీటి పెంపకం పెరిగింది. ప్రస్తుతం సంక్రాంతి తీర్థాలు కనుమ పండగ నుంచి ప్రారంభం కావడంతో గ్రామీణ తీర్థాల్లో గుర్రాల దౌడు మొదలైంది.
మైదానాలు రెడీ
చోడవరం, కొత్తకోట, దొండపూడి, టి.అర్జాపురం, రావికమతం, మాడుగుల, అచ్యుతాపురం, పాయకరావుపేట, నర్సీపట్నం, కోటవురట్ల, రాంబిల్లితోపాటు రాజరిక కీర్తిని సంతరించుకున్న పద్మనాభం, ఎస్.కోట, భీమిలి, ఆనందపురం ప్రాంతాల్లో గుర్రాల పరుగు పోటీలు జోరుగా నిర్వహిస్తున్నారు. సాధారణంగా మేలు రకం గుర్రాల ధర రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకూ ఉంటుంది. ముఖ్యంగా రాజస్థాన్, గుజరాత్, హైదరాబాద్, జైపూర్, కటక్ ప్రాంతాల నుంచి మేలు రకం గుర్రాలను కొనుగోలు చేసి ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు.
రేస్‌లు...ఇలా...
గుర్రాల పోటీలను మూడు రకాలుగా నిర్వహిస్తారు. పోటీకి వచ్చిన గుర్రాల సంఖ్యను బట్టి రెండు మూడు గ్రూపులుగా విభజించి ఒకేసారి 5 నుంచి 7 గుర్రాలను బరిలోకి దించి స్వారీ చేస్తారు. ముందుగా గమ్యం చేరిన గుర్రాలను వరుసగా గెలుపొందినట్టుగా ప్రకటిస్తారు. రెండో రకం పోటీలో రెండేసి గుర్రాలను బరిలోకి దించి దౌడు తీయిస్తారు. గెలుపొందిన వాటికి మరలా పోటీపెట్టి తుది విజేతలను ప్రకటిస్తారు. ఇక మూడో రకం పోటీల్లో ఒక్కో గుర్రాన్ని దౌడు తీయించి తక్కువ సమయంలో నిర్దేశించిన గమ్యాన్ని చేరిన గుర్రం గెలిచినట్టుగా ప్రకటిస్తారు. ఎక్కువ మైదానం ఉన్న చోట మొదటి రకం పందాలు నిర్వహిస్తుండగా, ఇపుడు తక్కువ స్థలంలో నిర్వహించాల్సి రావడంతో టైమింగ్ పందాలే ఎక్కువగా జరుగుతున్నాయి.
నేటి నుంచి పోటీలు
ఈనెల 17వ తేదీ జిల్లాలో అతి పెద్ద పండగైన చోడవరం మండలం నర్సాపురం తీర్థ మహోత్సవం, బుచ్చెయ్యపేట మండలం రాజాం, ఆనందపురం గ్రామాల్లో పండగలు సందర్భంగా జిల్లా స్థాయి గుర్రాల పరుగుల పోటీని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈనెల 18న భోగాపురంలోను, 20న శీమునాపల్లి గ్రామాల్లో జరిగే గ్రామ దేవతల పండగల సందర్భంగా జిల్లా స్థాయి గుర్రాల పరుగు పోటీలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు.
ఒకప్పుడు రవాణా సౌకర్యాలు లేని రోజుల్లో గుర్రం జట్కా బళ్లే ప్రధాన రవాణా వాహనంగా ఉండేవి. మారిన కాలంలో జట్కా బళ్లు కనుమరుగైపోవడంతో కొంతకాలం గుర్రాల గిట్టల శబ్దాలు కనుమరుగుయ్యాయి. ఇప్పుడు మళ్లీ చల్ చల్ గుర్రం...చలాకీ గుర్రం... అంటూ గుర్రాలు పరుగులు తీస్తున్నాయి. రాజుల కాలంలో ఓ వెలుగు వెలిగిన గుర్రపు స్వారీ, పరుగు పోటీలు ఇప్పుడు మరలా గ్రామాల్లో జోరుగా సాగుతున్నాయి. కేవలం క్రీడా స్ఫూర్తితో నిర్వహించే గుర్రాల పరుగు పోటీలు ఇటీవల కాలంలో గ్రామాల్లో జరిగే ప్రతి ఉత్సవాల్లో సందడి చేస్తున్నాయి.
దౌడుకు సిద్ధమైన
గుర్రాలు
ఎడ్ల బళ్ల పోటీలకు దీటుగా మైదానాలు సిద్ధం
సంక్రాంతి తీర్థాల్లో పోటీల సందడి
Comments
Please login to add a commentAdd a comment