వేర్వేరు ప్రాంతాల్లో ఐదుగురు మృతి
యలమంచిలి, కోటవురట్ల, అనకాపల్లి, రాంబిల్లి మండలాల్లో వేర్వేరు ఘటనలో ఐదుగురు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రైలు ఢీకొని ఇంటర్ విద్యార్థి...
యలమంచిలి రూరల్: మండలంలోని రేగుపాలెం రైల్వేస్టేషన్ సమీపంలో బుధవారం రైలు పట్టాలు దాటుతున్న ఓ విద్యార్థిని గుర్తుతెలియని రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో పీఎన్‌ఆర్ పేటకు చెందిన అన్నం వరప్రసాద్(18) అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక్కడ డౌన్ లైన్‌లో 711/23 వ నంబరు కిలోమీటరు వద్ద రైల్వే గ్యాంగ్‌మన్.. మృతదేహాన్ని చూసి తుని రైల్వే పోలీసులకు,రేగుపాలెం రైల్వేస్టేషన్‌లో స్టేషన్ సూపరింటెండెంట్‌కు సమాచారం ఇచ్చారు.ఘటనా స్థలానికి సిబ్బందితో చేరుకున్న రైల్వే ఎస్‌ఐ శ్రీనివాసరావు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.బహిర్భూమికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు.ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థి యలమంచిలిలో ఓ కళాశాలలో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. పోస్టుమార్టం అనంతరం విద్యార్థి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించినట్టు తుని ప్రభుత్వ రైల్వే ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపారు.రేగుపాలెం రైల్వేస్టేషన్ సూపరింటెండెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన చెప్పారు.
డివైడర్‌ను ఢీకొని..
అనకాపల్లి: జోనల్ కార్యాలయం వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో గాయపడిన నిమ్మకాయల ప్రకాష్(30) అనే వ్యక్తి కేజీహెచ్‌లో చికిత్స పొందు తూ మృతిచెందినట్టు ఎస్‌ఐ రషీద్ తెలిపారు. పట్టణంలో రైల్వే అండర్ బ్రిడ్జి ఏఎంసీ కాలనీకి చెందిన నిమ్మకాయల ప్రకాష్ మంగళవారం ద్విచక్రవాహనంపై ఏఎంసీ కాలనీ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వెళుతున్న సమయంలో జోనల్ కార్యాలయం వద్ద వాహనానికి కుక్క అడ్డురావడంతో తప్పించబోయి పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొన్నాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ప్రకాష్‌ను స్థానికులు హుటాహుటిన ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి, అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్టు ఎస్‌ఐ తెలిపారు. మృతుడు తల్లి రామలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చెప్పారు.
మెట్లపై నుంచి జారిపడి వృద్ధురాలు ...
రాంబిల్లి (యలమంచిలి): ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి జారిపడి ఒక వృద్ధురాలు మృతి చెందినట్టు రాంబిల్లి సీఐ సీహెచ్. నరసింగరావు బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు... రాంబిల్లి మండలం మురకాడ గ్రామానికి చెందిన గనిశెట్టి సత్యవతి (69)ఈనెల 13వ తేదీ ఉదయం ఇంటి పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నర్సింగరావు తెలిపారు.
గాయపడిన వ్యక్తి మృతి
యలమంచిలి రూరల్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన మండలంలోని తెరువుపల్లి గ్రామానికి చెందిన తుమ్మపాల నాగేశ్వరరావు(54) అనే వ్యక్తి విశాఖప ట్నం కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్టు యలమంచిలి రూరల్ ఎస్‌ఐ ఎం.ఉపేంద్ర తెలిపారు. ఈ నెల 13న నారాయణపురం కెనరా బ్యాంకుకు వెళ్లి యలమంచిలి–అచ్యుతాపురం రోడ్డు దాటుతున్న నాగేశ్వరరావును అచ్యుతాపురం నుంచి యలమంచిలి వైపు వస్తున్న స్కూటీ ఢీకొంది. ఈ ప్రమాదంలో నాగేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. యలమంచిలి ప్రభుత్వాస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి, అక్కడి నుంచి విశాఖ కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి మెరుగైన చికిత్స కోసం కుటుంబసభ్యులు తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
వరాహనదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
కోటవురట్ల: అన్నవరం శివారు వరాహనదిలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సరిహద్దు విషయంలో స్పష్టత లేకపోవడంతో అటు నర్సీపట్నం రూరల్, ఇటు కోటవురట్ల పోలీసు స్టేషన్ నుంచి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వీఆర్వో అప్పారావు అక్కడకు చేరుకుని కోటవురట్ల పరిధిగా తేల్చడంతో ఎస్‌ఐ రమేష్ మృతదేహాన్ని బయటకు తీయించారు. గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్‌ఐ రమేష్ మాట్లాడుతూ మృతదేహాన్ని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో భద్రపరిచినట్టు చెప్పారు. వివరాలు తెలిసిన వారు కోటవురట్ల పోలీసు స్టేసన్‌లో సంప్రదించాలని ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment