పండగ పూట విషాదం
● సముద్రంలో మునిగి బాలుడు మృతి ● యువకుడు గల్లంతు ● ఒకే కుటుంబంలో తీవ్ర విషాదం ● బాధితులు ఉమ్మడి తూ.గో జిల్లాకు చెందినవారు
ఎస్.రాయవరం: పండగ పూట ఆనందంగా గడిపిన ఆ కుటుంబాన్ని చూసి విధికే కన్ను కుట్టినట్టు ఉంది.. క్షణాల్లో సముద్ర కెరటాల రూపంలో దాడి చేసింది. ఈ ఘటనలో బాలుడు మృతి చెందగా.. మరో యువకుడు గల్లంతయ్యాడు. ఎస్‌ఐ విభీషణరావు అందించిన వివరాలు.. తుని మండలం లోవకొత్తూరు చెందిన బాసనబోయిన సాత్విక్ (9), అతని మేనత్త కొడుకు అయిన ప్రతిపాడు మండలం సింహాద్రిపురం గ్రామానికి చెందిన కాకర్ల మణికంఠ (22)లు సుమారు 30 మంది కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం రేవుపోలవరం తీరానికి వచ్చారు. సాయంత్రం వరకు సరదాగా గడిపిన వీరు స్నానం కోసం సముద్రంలోనికి దిగారు. కెరటాల తాకిడికి సాత్విక్ మునిగిపోవడం గమనించిన మణికంఠ.. సాత్విక్‌ను బయటకు నెట్టి మరో కెరటానికి కొట్టుకుపోయాడు. సాత్విక్‌ను రక్షించినప్పటికీ అప్పటికే అపస్మారక స్థితిలోనికి చేరుకోవడంతో మైరెన్ పోలీసులు, స్థానిక మత్స్యకారులు సీపీఆర్ చేసి హుటాహుటిన నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే మృతి చెందాడు. సాత్విక్ కోసం వెళ్లి మునిగిపోయిన మణికంఠ ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. కళ్ల ముందు ఘోర సంఘటన చూసిన కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో తీరం హోరెత్తిపోయింది. గల్లంతయిన మణికంఠ సంక్రాంతికి మేనమామ ఇంటికి రెండు రోజులు క్రితం వచ్చాడు. విషయం తెలుసుకున్న ఎస్.రాయవరం పోలీసులు మత్స్యకారుల సహాయంతో సాయంత్రం గాలింపు చర్యలు చేసినప్పటికీ మణికంఠ ఆచూకీ లభ్యం కాలేదు. ఎస్.రాయవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment