పులి కాదు.. అది నక్కే!
● వదంతులను నమ్మొద్దు
● యలమంచిలి అటవీశాఖ సెక్షన్ అధికారి రమణ స్పష్టీకరణ
● గొరపూడి కొండ ప్రాంతంలోపులి జాడల కోసం అన్వేషించిన అటవీ అధికారులు
రాంబిల్లి (యలమంచిలి): పులి కాదు...నక్కే అని యలమంచిలి అటవీ రేంజ్ సెక్షన్ అధికారి బి.వి రమణ స్పష్టం చేశారు. రాంబిల్లి మండలం నేవీ కాలనీ కొండ ప్రాంతంలో ఒక గుడి దగ్గర పులి సంచరిస్తున్నట్టు స్థానికులు కొంత మంది గురువారం రాత్రి సోషల్ మీడియాలో వీడియోలు తీసి ఫొటోలను పోస్ట్ చేయడం ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవ్వడం స్థానికంగా సంచలనం కలిగించిన విషయం విదితమే. దీనిపై శుక్రవారం యలమంచిలి అటవీశాఖ రేంజ్ ఆఫీసర్ అనిల్‌కుమార్ ఆదేశాలతో అటవీశాఖ సెక్షన్ అధికారి రమణ, అటవీశాఖ అధికారులు బృందం స్థానిక ప్రజాప్రతినిధులతో కలసి రాంబిల్లి మండలంలోని గొరపూడి కొండ ప్రాంతంలో జంతువు పాద ముద్రలను పరిశీలించి గాలించారు. ఈ సందర్భంగా నక్క పాదముద్రలను గుర్తించారు. అక్కడ సంచరించింది పులి కాదు నక్క అని ధృవీకరించారు. స్థానిక కొండ ప్రాంతానికి సముద్ర తీరం దగ్గరగా ఉండడం వల్ల అడవి జంతువులు కొన్ని సంచరిస్తున్నాయని, వాటిలో నక్కలు కూడా ఎక్కువగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఒక వేళ పులి సంచరించి ఉంటే చుట్టు పక్కల ఎక్కడో చోట ఏదో ఒక జంతువును వేటాడుతుందని, కానీ పులి జాడలు ఎక్కడా తమ కంట పడలేదని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను నమ్మవద్దని సూచించారు. ప్రజలెవరూ ఈ పులి ఉందంతంపై ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలిపారు. ఇటువంటి ఘటనలు, అటవీ అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు టోల్ ఫ్రీ నెంబరు 1800–425–5909కు ఫోన్‌లో సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి అటవీశాఖ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment