రేపు 1008 దంపతులతో అనఘా వ్రతం
● గణపతి సచ్చిదానంద స్వామిజీ ఆధ్వర్యంలో నిర్వహణ
అనకాపల్లి: సిరసపల్లిలోని చింతామణి గణపతి దత్తక్షేత్రంలో ఈ నెల 23న గణపతి సచ్చిదానంద స్వామిజీ ఆధ్వర్యంలో 1008 మంది దంపతులతో అనఘా వ్రతం నిర్వహిస్తున్నట్లు దత్త క్షేత్రం నిర్వాహకుడు ఆంజనేయరాజు తెలిపారు. మంగళవారం దత్తక్షేత్ర ఆవరణలో ఆయన మాట్లాడారు. అనఘా వ్రతం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందని, 11 గంటలకు 32 గణపతుల ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి మైసూర్ నుంచి గణపతి సచ్చిదానంద స్వామిజీ, దత్త విజకానంద తీర్థ స్వామిజీలు ముఖ్య అతిథులుగా విచ్చేస్తారన్నారు. గత నెల 25న మైసూర్‌లో స్వామీజీలు బయలు దేరి దేశంలో వివిధ దత్తక్షేత్రాలను దర్శించుకుని ఈ నెల 23న ఇక్కడకు వస్తున్నారన్నారు. 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకావిష్కరణ, చింతామణి రాగసాగర కార్యక్రమం (మెడిటేషన్ అండ్ హీలింగ్ కోసం సంగీతం), సాయంత్రం సహస్ర మోదక హోమం, స్వామీజీ వారిచే శ్రీచక్రపూజ వంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. భక్తులకు ఉచిత అన్న సమారాధన ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా 32 గణపతుల రూపాలను సిరసపల్లి చింతామణి గణపతి దత్తక్షేతంలో ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో దత్తక్షేత్రం సభ్యులు సి.పి.రామారావు, ఎస్.మహేష్‌కుమార్, ఎం.రవికుమార్, ఇంద్రలక్ష్మి, ఎం. రుషీకేశ్, సీహెచ్.సోమయాజులు, ఎ.పద్మావతి, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment