![పశుగణ](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/5/04npm02a-320007_mr-1738699267-0.jpg.webp?itok=aRwA_KpJ)
పశుగణన ముమ్మరం
● ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరిస్తున్న సిబ్బంది ● ఇంతవరకు 85 శాతం పూర్తి ● ఈ నెలాఖరుకు పూర్తి కానున్న సర్వే
నర్సీపట్నం: జిల్లాలో పశుగణన చురుగ్గా జరుగుతోంది. అన్ని రకాల పశు పక్ష్యాదులను లెక్కిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్త సర్వేలో భాగంగా జిల్లాలో ముమ్మరంగా పశుగణన చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 311 మంది ఎన్యూమరేటర్లు సర్వే చేస్తున్నారు. వీరంతా ఇంటింటికీ తిరిగి పశువుల లెక్కలు తీస్తున్నారు. రైతులు అందుబాటులో ఉండే సమయాలైన ఉదయం, సాయంత్రం వేళల్లో వివరాలు సేకస్తున్నారు. సర్వే ఈ నెలాఖరు నాటికి ముగియాల్సి ఉంది. జిల్లాలో అవాసాలు 762 ఉన్నాయి. 4,71,906 గృహాలు ఉన్నాయి. సగటున ఒక్కో ఎన్యూమరేటర్ రోజుకు 15 గృహాల చొప్పున సర్వే చేస్తున్నారు. గత ఏడాది నవంబరు ఒకటిన ప్రారంభమైన సర్వే ఇప్పటి వరకు 85 శాతం పూర్తయింది. శతశాతం జీవాల గణన పూర్తి చేయాలన్న లక్ష్యంతో పశుసంవర్ధకశాఖ అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు.
అన్ని రకాల జంతువులు 38.37 లక్షలు
జిల్లాలో అన్ని రకాల జంతువులు 38,37,749 లక్షలు ఉన్నట్లు నాలుగేళ్ల క్రితం జరిగిన పశుగణనలో అధికారులు తేల్చారు. వీటిలో ఆవులు 180673, ఎద్దులు 246293, గొర్రెలు 106358, మేకలు 179797, కోళ్లు 3124020, పందులు 489, గుర్రాలు 119 ఉన్నట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గడువు సమీపిస్తుండడంతో సర్వేను వేగవంతం చేశారు. నిర్దేశించిన సమయానికి సర్వేను పూర్తి చేసేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది శ్రమిస్తున్నారు.
శతశాతం సర్వేకు సహకరించాలి
అధికారులు, వైద్యులు, సిబ్బంది పశుగణనలో పాల్గొంటున్నారు. ఎన్యూమరేటర్లు ప్రతి గ్రామానికి ఒకరు ఉన్నారు. వీరు సెల్‌ఫోన్ ద్వారా యాప్‌లో నమోదు చేస్తున్నారు. జిల్లాలో సర్వే ముమ్మరంగా సాగుతోంది. ఈ నెలాఖరుకు పశుగణన పూర్తి చేస్తాం. పశువైద్యులు, పశువైద్య సిబ్బంది సర్వే చేయడానికి ఇంటి వద్దకు వచ్చినప్పుడు వివరాలు తెలియజేసి, శతశాతం సాధించేందుకు సహకరించాలి.
– డాక్టర్ డబ్ల్యూ.రాంబాబు,పశుసంవర్ధక శాఖ ఏడీ, నర్సీపట్నం
![పశుగణన ముమ్మరం 1](https://www.sakshi.com/gallery_images/2025/02/5/04npm02b-320007_mr-1738699267-1.jpg)
పశుగణన ముమ్మరం
Comments
Please login to add a commentAdd a comment