భక్తులకు ఇబ్బంది లేకుండా వెంకన్న కల్యాణోత్సవాలు
● రాష్ట్ర హోం మంత్రి అనిత సూచన
నక్కపల్లి: మార్చి 10వ తేదీన ఉపమాకలో జరిగే వేంకటేశ్వరస్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర హోం మంత్రి వంగల పూడి అనిత దేవస్థానం అధికారులకు, స్థానిక నాయకులకు సూచించారు. రథసప్తమిని పురస్కరించుకుని మంగళవారం ఆమె ఉపమాక వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం వచ్చే నెలలో జరిగే కల్యాణోత్సవ ఏర్పాట్లపై చర్చించారు. కల్యాణోత్సవాల్లో భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, ఎటువంటి లోటుపాట్లు జరగకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. తోపులాటకు ఆస్కారం లేకుండా చక్కగా దర్శనం అయ్యేటట్టు ప్రత్యేక క్యూలైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. దేవస్థానం మాజీ చైర్మన్ కొప్పిశెట్టి బుజ్జి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు కొప్పిశెట్టి కొండబాబు, మండల టీడీపీ అధ్యక్షుడు కొప్పిశెట్టి వెంకటేష్, తదితరులు మాట్లాడుతూ స్వామివారి పుష్కరిణిని శుభ్రం చేయించాలన్నారు. తిరుపతి లడ్డూలు ఇక్కడ విక్రయించే ఏర్పాటు చేయాలని కోరారు. స్థానికులు సూచించిన విషయాలను వినతిపత్రం రూపంలో తయారు చేసి తనకు అందజేస్తే టీటీడీ చైర్మన్, ఈవోల దృష్టికి తీసుకెళ్లి భక్తుల ప్రశంసలందుకునేలా కల్యాణోత్సవాలకు ఏర్పాట్లు చేయిస్తానని మంత్రి భరోసా ఇచ్చారు. అర్చక స్వాములు ప్రసాదాచార్యులు, కృష్ణమాచార్యులు, జనసేన నాయకులు గెడ్డం బుజ్జి స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment