![వేద ప](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/5/04cvm201-320033_mr-1738699266-0.jpg.webp?itok=qcwbhEt9)
వేద పారాయణ..
శ్రీసూర్యనారాయణ..
రాజుపాలెం సూర్యనారాయణమూర్తి ఆలయానికి పోటెత్తిన భక్తులు
సూర్యనారాయణమూర్తి ఆలయం వద్ద భక్తజన సందోహం
అనకాపల్లి: ప్రత్యక్ష దైవానికి జగతి భక్తితో ప్రణమిల్లింది. సకల జీవరాశులకు ప్రాణశక్తిని ఇచ్చి చల్లగా చూసే లోకబాంధవుడికి ప్రీతికరమైన రథసప్తమి రోజున ఆ దివ్యతేజోమూర్తి కరుణా కటాక్షాల కోసం అఖిల భక్తకోటి అంజలి ఘటించింది. ప్రభాకరుడి ఆలయాలలో ఆదిత్య హృదయ పఠనం మార్మోగింది. రాజుపాలెం సూర్యనారాయణస్వామిని వేలాదిమంది భక్తులు మంగళవారం దర్శించుకున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో నిలిచారు. దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సేవాదళ్ సభ్యులు భక్తులకు ఎక్కడికక్కడ సహకరించారు. ఆలయ పరిసరాల్లో భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. ఇరుకై న రహదారి కావడంతో వాహనాలు అడ్డుగా ఉండడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. డీఎస్పీ ఎం.శ్రావణి ఆధ్వర్యంలో రూరల్, పట్టణ, ట్రాఫిక్ సీఐలు అశోక్‌కుమార్, టి.వి.విజయకుమార్, ఎం.నారాయణమూర్తి ఆధ్వర్యంలో సుమారు 150 మంది సిబ్బందితో బందోబస్తును ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్ కర్రి కోటేశ్వరరావు, కమిటీ ప్రతినిధులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వామిని వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ పరిశీలకుడు కరణం ధర్మశ్రీ, పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకుడు మలసాల కుమార్‌రాజా, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ దర్శించుకున్నారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని రాజుపాలెం పరిసరప్రాంతంలో రథంపై కమిటీ సభ్యులు ఊరేగించారు. వ్యాపారవేత్త బంగారు సూరిబాబు, ఆదిబాబు దంపతుల ఆధ్వర్యంలో భారీ అన్నసమారాధన నిర్వహించారు. రాత్రికి స్టేజ్ ప్రోగ్రాంలు, నేలవేషాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. భారీ బాణాసంచాతో ఆలయ పరిసరాలు కాంతులీనాయి.
శారద నదీ తీరంలో సూర్య నమస్కారాలు
మాడుగుల: సత్యవరం గ్రామంలో సమరసత ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రథ సప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. శారద నది ఒడ్డున తెల్లవారక ముందే పుణ్య స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు, ప్రార్థనలు, సూర్యనమస్కారాలు ఆచరించారు. నది ఒడ్డున పాయసం తయారు చేసి సూర్యదేవునికి సమర్పించి, ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ధర్మ ప్రచారకుడు సన్యాసిశెట్టి మాట్లాడుతూ నదిలో రథసప్తమి రోజున స్నానం చేసి, సూర్యనమస్కారాలు చేస్తే ఆరోగ్యంతోపాటు కోటి జన్మల పుణ్యం వస్తుందన్నారు. హిందూ ధర్మ ప్రచార ససభ్యులు బోదా పాల్గుణ, ఎం.రాజేశ్వరి, నానుబిల్లి రాజేశ్వరి, గెంజి మాలతి, మిరియాల సత్యవతి, గాడి కొండతల్లి, గెంజి ఈశ్వరి, చినమ్మలు, గోపాలకృష్ణ పాల్గొన్నారు.
![వేద పారాయణ..1](https://www.sakshi.com/gallery_images/2025/02/5/04akp32d-320004_mr-1738699266-1.jpg)
వేద పారాయణ..
![వేద పారాయణ..2](https://www.sakshi.com/gallery_images/2025/02/5/04akp32e-320004_mr-1738699266-2.jpg)
వేద పారాయణ..
Comments
Please login to add a commentAdd a comment