వైఎస్సార్‌సీపీని వీడలేదని నిందారోపణలు
● రాజకీయం కోసం వెంకన్న ప్రతిష్ట దిగజార్చవద్దు ● ఆలయ అభివృద్ధికి అంతా కలిసిరండి ● వడ్డాది వేంకటేశ్వరస్వామి ఆలయ వంశపారంపర్య ధర్మకర్త కన్నబాబు
బుచ్చెయ్యపేట: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడలేదన్న అక్కసుతో దేవుడిని అడ్డుపెట్టుకుని తనపై కూటమి నేతలు లేనిపోని నిందారోపణలు చేస్తున్నారని వడ్డాది వేంకటేశ్వరస్వామి ఆలయ వంశపారంపర్య ధర్మకర్త దొండా కన్నబాబు ధ్వజమెత్తారు. స్వార్థ రాజకీయాల కోసం పవిత్రమైన వేంకటేశ్వరస్వామిని అడ్డుపెట్టుకుని లేనిపోని ఆరోపణలు చేస్తూ వడ్డాది పేరు ప్రతిష్టలను దెబ్బ తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ అభివృద్ధికి పాలక మండలి, అధికార్లు అడ్డుపడుతున్నారని పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు దొండా సన్యాసిరావు చేసిన ప్రకటనపై కన్నబాబు తీవ్ర ఆగ్రహం చెందారు. మంగళవారం ఆలయ ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన ఈవో శర్మతో కలిసి వడ్డాది వేంకటేశ్వరస్వామికి వస్తున్న ఆదాయ, వ్యయ వివరాలను వెల్లడించారు. వడ్డాది వేంకటేశ్వరస్వామికి ఏడాదికి సుమారు రూ.14 లక్షల వరకు ఆదాయం రాగా రూ.15 లక్షల వరకు ఖర్చులు అవుతున్నాయని చెప్పారు. గత నాలుగు నెలలుగా వైఎస్సార్‌సీపీని వీడి జనసేనలో చేరాలని సన్యాసిరావుతోపాటు నలుగురు వ్యక్తులు తనపై ఒత్తడి తెస్తున్నారని.. పార్టీ మారనని, వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతానని చెప్పడంతో దేవుడిని అడ్డుపెట్టుకుని కుటిల రాజకీయాలకు దిగారన్నారు. వీరి స్వార్థ రాజకీయం కోసం ఉత్తరాంధ్రలోనే ప్రసిద్ధి చెంది 151 ఏళ్ల చరిత్ర గల వేంకటేశ్వరస్వామి ఆలయ పవిత్రతను దెబ్బ తీయడం తగదన్నారు.
తాతల కాలం నుంచీ వెంకన్న సేవలో..
తన తాత వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించి 56 ఎకరాలు భూములివ్వగా అన్యాక్రాంతం అవకుండా చూస్తున్నామని, ఇటీవల తాను 22 సెంట్ల భూమిని దేవస్ధానానికి ఇచ్చానని కన్నబాబు చెప్పారు. 36 ఏళ్లుగా దేవస్ధానం వంశపారంపర్య ధర్మకర్తగా ఉంటూ వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాలు చేస్తున్నానని, గత రెండేళ్లుగా తన ఆరోగ్యం సహకరించక, గంటల కొలది నేలపై మఠం వేసుకుని కూర్చునే పరిస్ధితి లేక తన అన్న కుమారుడి చేత వేంకటేశ్వరస్వామి కల్యాణ వేడుకలను దగ్గరుండి చేయిస్తున్నానన్నారు. అర్చకుల సూచనలతోనే అతనితో కల్యాణ వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. విశాఖ డెయిరీ ద్వారా కల్యాణ మండపం నిర్మించబోగా వడ్డాదిలో ఉన్న నాయకుల వల్ల కొండపైన మండపం అధికారుల తీరు వల్ల ఆగిపోయిందన్నారు. ఆరోగ్యం బాగోక తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకున్నానని, కొంతమంది స్వార్థ రాజకీయాల తీరు కారణంగా వచ్చే స్థానిక ఎన్నికల్లో తన కుమారుడిని గాని తన అన్న కుమారుడిని గాని నిలబెట్టి వడ్డాది పేరు ప్రఖ్యాతులు పెరిగేలా కృషి చేస్తానని కన్నబాబు తెలిపారు. వడ్డాది వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి, కల్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించడానికి పార్టీలకు అతీతంగా అంతా కలిసి రావాలని కోరారు. ఆలయంలో దొంగ టికెట్లు అమ్ముతున్నట్లు నిరూపించాలని ఈవో శర్మ కోరారు. ఆలయ అభివృద్ధికి తోడ్పడిన భక్తులను దేవస్ధానం తరపున సత్కరిస్తున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment