మాట్లాడుతున్న ఎస్పీ అన్బురాజన్
అనంతపురం క్రైం: పోలీసు సిబ్బంది సంక్షేమానికి సమష్టిగా కృషి చేద్దామని ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ తెలిపారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలోని తన చాంబర్‌లో పోలీసు అధికారులు, పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులతో వెల్ఫేర్ కమిటీ సమావేశం నిర్వహించారు. పోలీసు సిబ్బంది, కుటుంబ సభ్యుల సంక్షేమానికి అమలు చేస్తున్న కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఏఆర్ డీఎస్పీ మునిరాజు, ఆర్‌ఐలు హరికృష్ణ, రాముడు, జిల్లా పోలీసు కార్యాలయం పరిపాలనాధికారి శంకర్, వెల్ఫేర్ ఆర్‌ఎస్‌ఐ రమేష్ నాయక్, జిల్లా పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు సాకే త్రిలోకనాథ్, సుధాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
రూ. 3 లక్షల చెక్కుల అందజేత
ఏఆర్ ఎస్‌ఐ షంషీర్ వలీ, సివిల్ కానిస్టేబుల్ ఉమేష్, ఏఆర్ కానిస్టేబుల్ కిరణ్ కుమార్‌లు ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారి కుటుంబాలకు అడిషనల్ కార్పస్ ఫండ్ కింద రూ. 3 లక్షల విలువ చేసే చెక్కులను ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ అందజేశారు. కార్యక్రమంలో షంషీర్ వలీ భార్య మస్తాన్‌బీ, ఉమేష్ భార్య వనిత, కిరణ్ కుమార్ భార్య అనిత, తదితరులు పాల్గొన్నారు.
ఆరు దుకాణాల్లో చోరీ
గుత్తి: స్థానిక గుంతకల్లు రోడ్డులోని ఆరు దుకాణాల్లో దుండగులు చొరబడి నగదు, విలువైన సామగ్రిని అపహరించుకెళ్లారు. వివరాలు.. గుంతకల్లు రోడ్డులోని మధుసూదన్, నందగోపాల్, బాషా కిరాణా దుకాణాలతో పాటు హర్షవర్దన్ హెల్త్ క్లినిక్, దాదా మెడికల్ స్టోర్, బ్రహ్మణి డయాగ్నిస్టిక్ సెంటర్, శ్రీరామ ఫర్టిలైజర్స్ దుకాణాల్లో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోరీ జరిగింది. మొత్తం రూ.13 వేలు నగదుతో పాటు విలువైన వస్తువులు అపహరించుకెళ్లారు. మరో మూడు దుకాణాల్లో చోరీకి విఫలయత్నం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీంను రంగంలో దించి ఆధారాలు సేకరించారు. ఘటనపై కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ వెంకట్రామిరెడ్డి, ఎస్‌ఐ నబీరసూల్ తెలిపారు.
బస్సు, ఐచర్ ఢీ
● ఏడుగురికి స్వల్ప గాయాలు
గార్లదిన్నె: ఆర్టీసీ బస్సు, ఐచర్ వాహనం ఢీకొన్న ఘటనలో ఏడుగురు గాయపడ్డారు. వివరాలు... గుంతకల్లు నుంచి గురువారం రాత్రి అదే డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 62 మంది ప్రయాణికులతో అనంతపురానికి బయలుదేరింది. గార్లదిన్నె విద్యుత్ సబ్ స్టేషన్ వద్దకు చేరుకోగానే వైజంక్షన్ వద్ద జాతీయ రహదారిపైకి చేరుకునే క్రమంలో అనంతపురం నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న ఐచర్ వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఘటనలో బస్సులోని ప్రయాణికులు కడ్డీలను, ఎదురుగా ఉన్న సీట్లను బలంగా ఢీకొనడంతో నలుగురికి రక్తగాయాలు, మరో ముగ్గురికి మూగదెబ్బలు తగిలాయి. క్షతగాత్రులను వెంటనే 108 అంబులెన్స్ ద్వారా స్థానిక పీహెచ్‌సీకి తరలించి, చికిత్స అందజేశారు. అనంతరం ప్రయాణికులను మరో బస్సులు గమ్యస్థానానికి చేర్చారు. ఘటనపై గార్లదిన్నె పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment