కర్షకలోకం కడలి తరంగమై కదలివచ్చింది. అనంతపురంలో కవాతు నిర్వహించింది. హామీలిచ్చి మోసం చేసిన కూటమి సర్కారుపై ధ్వజమెత్తింది. వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు వెంటరాగా.. జెడ్పీ కార్యాలయం వద్ద నుంచి కలెక్టరేట్ వరకూ గర్జన చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం అన్నదాతలకు అండగా అనంతపురంలో నిర్వహించిన ర్యాలీ విజయవంతమైంది.
● జెడ్పీ నుంచి కలెక్టరేట్ వరకూ నిరసన ప్రదర్శన
● వేలాదిగా తరలివచ్చిన రైతులు, ప్రజలు
● ప్రభుత్వ తీరును ఎండగట్టిన నాయకులు
● అన్నదాతలను ఆదుకోకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామన్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత
అనంతపురం కార్పొరేషన్: రైతు సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా, అన్నదాతలకు అండగా నిలిచేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కేంద్రమైన అనంతపురంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించింది. రైతులు, ప్రజలు నిరసన ప్రదర్శనలో పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ఆరు నెలల కూటమి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత స్పష్టమైంది. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో జెడ్పీ కార్యాలయం వద్దకు ఎమ్మెల్సీలు మంగమ్మ, శివరామిరెడ్డి, ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త విశ్వేశ్వరరెడ్డి, తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త పెద్దారెడ్డి, కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య, రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి, శింగనమల సమన్వయకర్త వీరాంజినేయులు, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, వైస్ చైర్‌పర్సన్ నాగరత్నమ్మ, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్ రెడ్డి, రాయదుర్గం మునిసిపల్ చైర్‌పర్సన్ శిల్పా, గుంతకల్లు వైస్‌చైర్‌పర్సన్ నైరుతిరెడ్డి, టాస్క్ ఫోర్స్ సభ్యులు రమేష్‌గౌడ్, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఎన్‌వీ నారాయణ, పార్టీ ముఖ్యనేతలు అనంత చంద్రారెడ్డి, ఉమామహేశ్వర్‌నాయుడు, సాకే చంద్ర, తదితరులు చేరుకున్నారు. మొదటగా జిల్లా అధ్యక్షుడు అనంతతో పాటు సమన్వయకర్తలు.. అంబేడ్కర్, మహానేత వైఎస్సార్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జెడ్పీ నుంచి సప్తగిరి సర్కిల్, సూర్యనగర్, సంగమేష్ సర్కిల్ మీదుగా కలెక్టరేట్ వరకూ ర్యాలీ సాగింది. మొదటి నుంచి చివరి వరకూ ర్యాలీ జనసంద్రాన్ని తలపించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రైతులకు జరిగిన అన్యాయానికి సంబంధించిన ప్లకార్డులను ర్యాలీలో ప్రదర్శించారు. రెట్టింపు ఉత్సాహంతో పార్టీ శ్రేణులు తరలివచ్చారు. అనంతరం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మకు 8 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. అంతకుముందు కలెక్టరేట్ ఎదుట ప్రచార రథంపై జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, సమన్వయకర్తలు ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment