జర్నలిస్టులపై దాడులు చేయడం దుర్మార్గం
అనంతపురం ఎడ్యుకేషన్/అనంతపురం: జర్నలిస్టులపై రాజకీయ నాయకుల దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికై నా ఆపకపోతే తాము కూడా ప్రతిఘటించాల్సి ఉంటుందని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (ఏపీడబ్ల్యూజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి హెచ్చరించారు. వైఎస్సార్ జిల్లాలో ‘సాక్షి’ విలేకరులపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు శుక్రవారం మచ్చా రామలింగారెడ్డి అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. రాజకీయ నాయకులు, సినిమా స్టార్లకు జర్నలిస్టులపై దాడులు చేయడం ఫ్యాషన్‌గా మారిందన్నారు. మీడియా అండతో ఎదిగిన మంచు ఫ్యామిలీ టీవీ–9 రిపోర్టర్‌పై దాడి చేయడం హేయమన్నారు. ఇటీవల గుంతకల్లులో ఐన్యూస్ ప్రతినిధిపై దాడి చేయడం దుర్మార్గమన్నారు. జర్నలిస్ట్‌లపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం సరికాదన్నారు.
టీడీపీ గూండాలను అరెస్టు చేయండి
వైఎస్సార్ కడప జిల్లాలో నీటి సంఘాల ఎన్నికల కవరేజీకి వెళ్లిన సాక్షి టీవీ విలేకరి శ్రీనివాసులు, కెమెరామెన్ రాము, సాక్షి పత్రిక రిపోర్టర్ రాజారెడ్డిలపై దాడి చేసిన టీడీపీ గూండాలను వెంటనే అరెస్ట్ చేయాలని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) రాష్ట్ర కార్యదర్శి కొత్తపల్లి అనిల్‌కుమార్‌రెడ్డి ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై అమానుషంగా దాడి చేసి, వారి వద్ద ఉన్న కెమెరాలను, సెల్‌ఫోన్లను లాక్కొని పగులగొట్టడం తీవ్రంగా పరిగణించి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.
నేడు నిరసన ప్రదర్శనలు
జర్నలిస్టులపై జరుగుతున్న దాడులకు నిరసనగా జెడ్పీ కార్యాలయం సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద శనివారం ఉదయం 10:30 గంటలకు నిరసన కార్యక్రమం ఉంటుందని ఐక్య జర్నలిస్ట్ సంఘాల నాయకులు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజాస్వామికవాదులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయంతం చేయాలన్నారు.
ముక్తకంఠంతో ఖండించిన
జర్నలిస్టు సంఘాలు
నేడు జెడ్పీ కార్యాలయం వద్ద నిరసన
Comments
Please login to add a commentAdd a comment