హంద్రీ–నీవా కాలువ వెడల్పు చేయాల్సిందే
అనంతపురం సెంట్రల్: హంద్రీ–నీవా ప్రాజెక్టు ప్రయోజనాలకు సమాధి కట్టే కార్యక్రమానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారని జల సాధన సమితి నాయకులు మండిపడ్డారు. హంద్రీ–నీవా కాలువ వెడల్పు చేయకుండానే లైనింగ్ పనులు చేపట్టేందుకు కూటమి ప్రభుత్వం జీఓ జారీ చేయడాన్ని ఖండిస్తూ జలసాధన సమితి అధ్యక్షుడు రామ్‌కుమార్ అధ్యక్షతన శుక్రవారం హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ గేయానంద్, సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్, పలు రైతు సంఘాల నాయకులు, జలసాధన సమితి నాయకులు పాల్గొని మాట్లాడారు. హంద్రీ–నీవా కాలువ పనులు వెడల్పు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ఈ ప్రాజెక్టు రూపకల్పన జరిగిందన్నారు. ఇది సాధ్యం కావాలంటే శ్రీశైలం సమీపంలోని మల్యాల నుంచి బెళుగుప్ప మండలం జీడిపల్లి వరకూ మొదటి దశ హంద్రీ–నీవా కాలవను 10వేల క్యూసెక్కులకు, జీడిపల్లి నుంచి దిగువకు 6 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉండేలా కాలువ వెడుల్పు చేయాల్సిన అవసరముందన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సైతం హంద్రీ–నీవాను 3,850 క్యూసెక్కుల నుంచి 6,300 క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యం ఉండేలా వెడల్పు చేసి లైనింగ్ పనులు చేపడుతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇందుకు సంబంధించి 2021లో రూ.6,182 కోట్లతో పనులకు పరిపాలన అనుమతులు కూడా ఇచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సీఎం చంద్రబాబు మాత్రం హంద్రీ–నీవా ప్రాజెక్టు లక్ష్యానికి తూట్లు పొడిచేలా 304, 305 జీఓలను జారీ చేసి కాలువ వెడల్పు పనులకు శాశ్వతంగా గండి కొట్టారని మండిపడ్డారు. వెంటనే ఈ జీఓలను రద్దు చేసి, హంద్రీ–నీవా కాలవను వెడల్పు చేయడంతో పాటు డిస్ట్రిబ్యూటరీలను నిర్మించి జిల్లాలోని 3.45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ సీఈ నాగరాజుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జల సాధన సమితి కార్యదర్శి గంగిరెడ్డి, అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ (ఏపీడీఆర్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, మానవ హక్కుల వేదిక ప్రతినిధి ఎస్‌ఎం బాషా, రచయిత శాంతినారాయణ, రైతు సంఘం నాయకుడు చంద్రశేఖర్‌రెడ్డి, సీపీఐ నేత మల్లికార్జున, భారత రైతు సంక్షేమ సంఘం నాయకుడు కసిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, విద్యావంతుల వేదిక నాయకులు వెంకటేష్, సురేష్, కృష్ణ, ఏసు, పెద్దన్న, వీరనారప్ప, అరుణోదయ కళా మండలి నాయకులు చండ్రాయుడు తదితరులు పాల్గొన్నారు.
రైతుల ప్రయోజనాలకు సమాధి కడితే సహించం
సీఎం నిర్ణయంపై జలసాధన సమితి నాయకుల మండిపాటు
కాలువ వెడల్పు చేయకనే లైనింగ్ పనులు చేపట్టే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment