పీఏసీఎస్ ఈకేవైసీకి ప్రత్యేక డ్రైవ్
అనంతపురం అర్బన్: ప్రాథమిక సహకార సంఘాల(పీఏసీఎస్) సభ్యుల ఈకేవైసీ కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ జిల్లా కో–ఆపరేటివ్ అధికారి అరుణకుమారిని ఆదేశించారు. కేంద్ర ప్రాయోజిత పథకం పీఏసీఎస్ కంప్యూటరైజేషన్‌లో భాగంగా రికార్డుల్లో ఈకేవైసీ వివరాలను నవీకరించాలన్నారు. ఇందుకు మిషన్ మోడ్‌లో డ్రైవ్ చేపట్టాల్సి ఉందన్నారు. కంప్యూటరైజేషన్‌లో భాగంగా సహకార సంఘాల సభ్యులందరూ ఈకేవైసీ చేయించుకునేలా చర్యలు తీసుకోవాలని సహకార సంఘాల కమిషనర్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయన్నారు. జనవరి 1వ తేదీ తరువాత రుణాలతో సహా అన్ని పీఏసీఎస్ సేవలు ఆన్‌లైన్‌లో ఉంటాయన్నారు. అటు తరువాత సభ్యులు ఈకేవైసీ లేకుండా ఎలాంటి లావాదేవీలు చేయలేరన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని అన్ని సహకార సంఘాల సభ్యులందరూ సంబంధిత సచివాలయాల్లో ఈకేవైసీ చేసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో సహకార సంఘాల ద్వారా ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలకు సంఘాల సభ్యులకు ఇబ్బందులు రాకుండా చూడడమే ఈకేవైసీ ఉద్దేశమన్నారు. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తిచేసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని డీసీఓని ఆదేశించారు.
రైలు కింద పడి
యువకుడి మృతి
గార్లదిన్నె: మండలంలోని కల్లూరు రైల్వేస్టేషన్ సమీపంలో శనివారం రాత్రి ఓ యువకుడు రైలు కింద పడి మృతి చెందాడు. ఆదివారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడిని శింగనమల మండలం కల్లుమడి గ్రామానికి చెందిన చలపతి (25) గుర్తించారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment