కుందుర్పి: బతుకు తెరువు కోసం కర్ణాటక ప్రాంతానికి వలస వెళ్లిన వ్యక్తి అక్కడే అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... కుందుర్పి మండలం వడ్డెపాళ్యం గ్రామానికి చెందిన బైరన్న (54) రెండు నెలల క్రితం బతుకు తెరువు కోసం కర్ణాటకలోని గౌరీబిదనూరుకు వలస వెళ్లి అక్కడే తమ గ్రామానికి చెందిన మేసీ్త్ర తిమ్మరాజు వద్ద కూలీగా పనిలో చేరాడు. సోమవారం వేకువజామున బైరన్న భార్య లక్ష్మీదేవికి మేస్రీ తిమ్మరాజు ఫోన్ చేసి బైరన్నకు సీరియస్‌గా ఉందని తెలిపాడు. ఉదయం మళ్లీ ఫోన్ చేసి మృతదేహాన్ని తీసుకువచ్చినట్లు తెలిపి అప్పగించి వెళ్లాడు. అయితే మృతికి సంబంధించి కర్ణాటకలో కేసు నమోదు కాకపోవడంతో తిమ్మరాజు ప్రవర్తనపై అనుమానాస్పదంగా ఉండడంతో కుందుర్పి పోలీసులకు లక్ష్మీదేవి, కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన పోలీసులు... భైరన్న మృతదేహాన్ని కళ్యాణదుర్గంలోని సీహెచ్‌సీకి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ నగేష్ తెలిపారు.
గిల్టు నగల అపహరణ
పెనుకొండ: స్థానిక నగర పంచాయతీ పరిధిలోని మంగాపురంలో నివాసముంటున్న ఉమాపతినాయక్ ఇంట్లో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. రోల్డ్‌గోల్డ్ నగలతో పాటు కొన్ని డాక్యుమెంట్‌లను ఎత్తుకెళ్లినట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆస్తి వివాదాల కారణంగా ఉమాపతినాయక్ కుటుంబం హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment