చెరువు.. అవస్థల దరువు
శింగనమల: ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే అతి పెద్ద చెరువుగా పేరుగాంచిన శింగనమల రంగరాయుల చెరువు కింద పంటలు పెట్టే సమయంలో కాలువలకు నీరు వదులుకోవాలంటే ఆయకట్టు రైతులకు నరకం కనిపిస్తోంది. చెరువులోని తూములకు షట్టర్లు లేకపోవడంతో వాటిని కట్టెలతో ఎత్తుకోవాల్సి వస్తోంది. ప్రపంచ బ్యాంక్ నిధులు మంజూరైనా షట్టర్ల ఏర్పాటు కార్యరూపం దాల్చకపోవడంతో అన్నదాతల అవస్థలు చెప్పనలవిగా ఉంటున్నాయి.
చెరువులో ఏళ్ల క్రితం ఒక ఇనుప రాడ్ ఏర్పాటు చేసి దాని కింద భాగంలో మొద్దు ఉంచారు. రైతులు నీటిలో ఈదుకుంటూ వెళ్లి తూముల పైకి ఎక్కి రాడ్‌ను పైకి లాగితే నీరు బయటకు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. కొన్ని సార్లు రాడ్‌కు ఉన్న మొద్దు జారితే నీరు పారకుండా నిలిచిపోతున్నాయి. ఈ క్రమంలో రైతులు గజ ఈతగాళ్లను రప్పిస్తున్నారు. వారు నీటిలో 10 అడుగుల లోతుకు వెళ్లి మొద్దుకు రాడ్‌ను తగిలించాకే నీరు యథావిధిగా ప్రవహిస్తున్నాయి. అయితే, ఇటీవల గజ ఈతగాళ్లు కరువైపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఇద్దరు మాత్రమే దొరుకుతున్నారని, భవిష్యత్తులో సమస్య తలెత్తితే ఏం చేయాలో పాలుపోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాంగ్‌వేర్ నిర్మించి, తూములకు షట్టర్లు ఏర్పాటు చేస్తే అవస్థలు తప్పుతాయని చెబుతున్నారు.
రంగరాయుల చెరువులో మరమ్మతుల కోసం 2018–19లో ప్రపంచ బ్యాంక్ నుంచి రూ.4.50 కోట్ల నిధులు మంజూరయ్యాయి. చెరువు 4 తూములకు గ్యాంగ్‌వేర్ నిర్మించి, షట్టర్లు ఏర్పాటు చేయాలని అప్పట్లో ప్రతిపాదనలు చేశారు. చెరువు కట్టపై 3 మీటర్ల వెడల్పుతో మట్టి వేయించడం, చెరువు కొత్త మరువలో మరమ్మతులు చేయాలని కూడా ప్రతిపాదించారు. అయితే, కేవలం కాలువలపై అక్కడక్కడా చిన్న బ్రిడ్జిలు నిర్మించి, చెరువు కట్ట ముందు సైడ్‌వాల్ కట్టి చేతులెత్తేశారు. ఇప్పటికై నా ఇరిగేషన్ అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
షట్టర్లు ఏర్పాటు చేయాలి
పంటలు పెట్టే సమయంలో కాలువలకు నీరు వదులుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటోంది. తూములకు ఏర్పాటు చేసిన రాడ్‌లు పైకి లేవకపోతే నీరు బయటకు రావు. మొద్దు జారిపోతే రెండు రోజుల పాటు శ్రమించాలి. నీటిలో మునిగి పనిచేయాలి. తూములకు షట్టర్లు ఏర్పాటు చేస్తే అవస్థలు తప్పుతాయి.
– తిరుపతయ్య, రైతు, శివపురం
నీరు తగ్గిన వెంటనే చర్యలు
శింగనమల చెరువులో నీరు తగ్గిన వెంటనే తూముల మరమ్మతు పనులు చేపడతాం. చెరువు అభివృద్ధికి గతంలో ప్రపంచ బ్యాంక్ నిధులు విడుదలయ్యాయి. త్వరలోనే చర్యలు చేపట్టి అవస్థలు లేకుండా చూస్తాం.
– రాజ్‌కుమార్, ఇరిగేషన్ డీఈ
నిధులు మంజూరైనా..
ఈతగాళ్లు కరువై...
దాదాపు 5 వేల ఎకరాల్లో పంటలు..
రంగరాయుల చెరువు కింద అధికారికంగా దాదాపు 2,800 ఎకరాల ఆయుకట్టు భూములు ఉన్నాయి. శింగనమల, గోవిందరాయునిపేట, సోదనపల్లి, మట్లగొంది, ఈస్ట్ నరసాపురం, శివపురం, సీ.బండమీదపల్లి, చక్రాయిపేట, పోతురాజుకాల్వ, పెరవలి గ్రామాల పరిధిలో మరో 2,000 ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు. చెరువు నుంచి నీరు బయటకు ప్రవహించడానికి నాలుగు తూములు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా నీరు ఆయకట్టుకు పారుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment