మందుబాబులు పెరిగారు!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: కూటమి సర్కారు మద్యం కిక్కు బాగా ఎక్కించింది. రోజు రోజుకూ మందుబాబుల సంఖ్య గణనీయంగా పెరుగుతు న్నట్టు తాజా గణాంకాలు చెబుతున్నాయి. కొత్త మద్యం పాలసీ వచ్చినప్పటి నుంచి జిల్లా పరిధిలోనే 41.49 లక్షల లీటర్ల మద్యం వినియోగమైంది. రోజుకు 30,735 లీటర్ల మద్యం తాగుతున్నారు. 9,297 లీటర్ల బీరు సేవిస్తున్నట్లు తేలింది. గడిచిన నాలుగున్నర నెలల కాలంలో రూ.336.38 కోట్ల విలువైన మద్యం అమ్ముడుబోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
అత్యధికంగా అనంత అర్బన్‌లోనే..
అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మరీ ఎక్కువగా మద్యం వినియోగం జరుగుతోంది. నగరంలో 135 రోజుల్లోనే రూ.116 కోట్ల విలువైన మద్యం తాగారు. ఉదయం 8 గంటల నుంచే వైన్ షాపులు తెరవడం, దీంతో పాటు కొన్నచోటే తాగే వెసులుబాటు లభిస్తుండటంతో మందుబాబులు బారులు తీరుతున్నారు. అనంతపురం, తాడిపత్రి వంటి నగరాల్లో వైన్‌షాపులు బార్‌లను తలపిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.
కుర్రకారు మొగ్గు..
మద్య సేవనానికి కొత్తగా అలవాటు పడుతున్న వారి సంఖ్య ఇటీవల పెరిగింది. ఇందులోనూ 25 ఏళ్ల యువకులు ఎక్కువగా ఉన్నారు. గడిచిన నాలుగున్నర నెలల కాలంలో 12.55 లక్షల బీర్లు వినియోగ మైతే అందులో 60 శాతం మంది యువకులే ఉన్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత వీళ్లు విస్కీ, బ్రాందీవైపు కూడా మొగ్గు చూపుతున్నారు. ఇక పల్లెల్లో మద్యానికి బానిసై రకరకాల రుగ్మతల బారిన పడుతున్నారు. ఇటీవల ఉరవకొండలో మద్యానికి బానిసైన ఓ వ్యక్తి మరణించిన విషయం తెలిసిందే. గతంలో బహిరంగ మద్యం సేవనంపై తీవ్ర నియంత్రణ ఉండేది. కూటమి సర్కారు వచ్చాక పట్టించుకునే వారే లేకపోవడంతో మందుబాబులు తాగుతూ తూలుతున్నారు.
మద్యం తాగే వారి సంఖ్యలో పెరుగుదల
నాలుగున్నర నెలల్లో 41.49 లక్షల లీటర్ల మద్యం వినియోగం
Comments
Please login to add a commentAdd a comment