టీ కేఫ్‌లో సంతకాలు
కదిరి టౌన్: శ్రీసత్యసాయి జిల్లా కదిరి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసులు ఓ టీ కేఫ్‌లో కూర్చొని రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన కీలక ఫైళ్లపై సంతకాలు చేయడం దుమారం రేపుతోంది. వాస్తవానికి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసులు ప్రస్తుతం సెలవులో ఉన్నారు. కానీ శుక్రవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలోని ఓ టీ కేఫ్‌లో కూర్చొని కీలక ఫైళ్లపై చకచకా సంతకాలు చేశారు. ఈ ఫైళ్లను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి అక్కడికి తీసుకెళ్లడం గమనార్హం. ప్రభుత్వం భూముల మార్కెట్ విలువలు పెంచిన నేపథ్యంలో అవి అమల్లోకి రావడానికి ముందు రోజు (శుక్రవారం) భారీఎత్తున రిజిస్ట్రేషన్లు జరిగేందుకు వీలుగా సబ్ రిజిస్ట్రార్ ఈ నిర్వాకానికి ఒడిగట్టారు. శుక్రవారం ఉమ్మడి జిల్లాలోనే గరిష్టంగా కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 139 రిజిస్ట్రేషన్లు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో భారీ మొత్తాలు చేతులు మారినట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసులును వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా..ఆయన ఫోన్‌లో అందుబాటులోకి రాలేదు. కార్యాలయ సిబ్బందిని అడగ్గా.. సబ్ రిజిస్ట్రార్ సెలవులో ఉన్నట్లు తెలిపారు. సెలవులో ఉన్నప్పటికీ టీ కేఫ్‌లో కూర్చొని డాక్యుమెంట్లపై సంతకాలు చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
కదిరి సబ్ రిజిస్ట్రార్ నిర్వాకం
Comments
Please login to add a commentAdd a comment