‘పురం’లో చింతపండు క్రయవిక్రయాలు ప్రారంభం
హిందూపురం అర్బన్: హిందూపురం వ్యవసాయ మార్కెట్‌లో ఆదివారం చింతపండు క్రయవిక్రయాలు ప్రారంభమయ్యాయి. ఫ్లవర్ రకం క్వింటాలు రూ.6 వేలు, కరిపులి రకం రూ.14 వేలు పలికాయి. మార్కెట్ యార్డు ఇన్‌చార్జ్ కిషోర్, వ్యాపార సంఘం అధ్యక్షులు శ్రీకాంత్, కార్యదర్శి దీపక్, ట్రెజరర్ శేషు, వైస్ ప్రెసిడెంట్ రాంబాబు, వేణుగోపాల్‌రెడ్డి వ్యాపారులు పాల్గొన్నారు.
ఫీజు పోరు ర్యాలీకి
జీపీఎస్ మద్దతు
అనంతపురం టవర్‌క్లాక్: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల కోసం ఈ నెల 5న వైఎస్సార్‌సీపీ తలపెట్టిన ర్యాలీకి గిరిజన ప్రజా సమాఖ్య (జీపీఎస్) మద్దతు తెలిపింది. ఈ మేరకు జీపీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు మల్లికార్జుననాయక్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ల
రిజర్వేషన్ ఖరారు
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ యార్డుల చైర్మన్ల ఎంపికకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారైనట్లు మార్కెటింగ్‌శాఖ ఏడీ పి. సత్యనారాయణచౌదరి ఒక ప్రకటనలో తెలిపారు. అనంతపురం– ఓసీ (జనరల్), గుంతకల్లు– ఎస్టీ (మహిళ), గుత్తి– బీసీ (మహిళ), కళ్యాణదుర్గం– బీసీ(మహిళ), రాయదుర్గం–ఓసీ(జనరల్), శింగనమల–బీసీ (మహిళ), తాడిపత్రి–ఎస్సీ(మహిళ), ఉరవకొండ–ఓసీ (జనరల్), రాప్తాడు– ఓసీ (జనరల్)గా ఖరారు చేసినట్లు వెల్లడించారు.
టీడీపీ నేతపై
పోక్సో కేసు నమోదు
కణేకల్లు: బాలికను వేధింపులకు గురి చేసిన అంశానికి సంబంధించి టీడీపీ నేతపై చర్యలు తీసుకోవడంలో మీనమీసాలు లెక్కించిన పోలీసులు ఎట్టకేలకు శనివారం రాత్రి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వివరాలు... కణేకల్లు మండలంలోని ఓ గ్రామానికి చెందిన నిరుపేద బాలికను టీడీపీ నేత ముక్కన్న లైంగికంగా వేధించిన విషయం తెలిసిందే. వేధింపులు తారస్థాయికి చేరుకోవడంతో మూడు రోజుల క్రితం బాలిక ఆత్మహత్యాయత్నం చేయబోయింది. సకాలంలో గుర్తించిన గ్రామస్తులు, తల్లిదండ్రులు వెంటనే బాలికను కాపాడి, విషయం తెలుసుకున్నారు. అనంతరం స్థానికులంతా ఏకమై టీడీపీ నేత ముక్కనను గ్రామంలో కట్టేసి దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ముక్కనను విడిపించారు. అనంతరం ఘటనపై బాలిక తల్లి నుంచి ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదులో జాప్యం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే విషయం కాస్త పత్రికల ద్వారా బహిర్గతం కావడంతో నిందితుడిపై ఎట్టకేలకు శనివారం రాత్రి ఐపీసీ 75/1, పోక్సో యాక్ట్ 11, 12 కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
డివైడర్‌ను ఢీ కొన్న
ఆర్టీసీ బస్సు
పెద్దవడుగూరు: మండలంలోని వీరేపల్లి వద్ద 63వ జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు డివైడర్‌ను ఢీకొంది. గుత్తి డిపోకు చెందిన ఏపీ02టీసీ 6706 బస్సు తాడిపత్రి నుంచి ప్రయాణికులతో వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. క్లచ్ ప్లేట్లు పని చేయకపోవడమే ఇందుకు కారణంగా తెలు స్తోంది. ప్రమాదంలో గాయపడిన కండెక్టర్ రమేష్‌తో పాటు ప్రయాణిస్తున్న ఓ చిన్నారిని తక్షణమే గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సురక్షితంగా బయటపడిన ప్రయాణికులను మరో బస్సులో గమ్యస్థానానికి చేర్చారు.
Comments
Please login to add a commentAdd a comment