యువజన విభాగం సైన్యంలా పని చేయాలి
అనంతపురం కార్పొరేషన్: ‘గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో యువత ఎంతో కీలకంగా పనిచేశారు. ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో యువజన విభాగం సైన్యంలా పని చేయాలి’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని కనకదాస కళ్యాణ మండపంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం నేతల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మేనిఫెస్టోను చిత్తశుద్ధితో అమలు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలవుతున్నా..ఒక్క హామీ అమలు చేయలేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అధికార పార్టీ నేతల బెదిరింపులు, అక్రమ కేసులపై కలసికట్టుగా పోరాటం చేద్దామన్నారు. ఎవరికి ఇబ్బంది వచ్చినా పార్టీ ముందుంటుందని తెలియజేశారు. సోషల్ మీడియాను సమర్థవంతంగా వినియోగించుకుని ప్రజలను చైతన్యం చేయాలన్నారు. అఽధికారంలో ఉన్నా..ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన నిలుస్తా మన్నారు. విద్యుత్ చార్జీల పెంపుపై ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళనలు చేశామని, ఎవరూ ఊహించని విధంగా స్పందన వచ్చిందన్నారు. ఈ నెల 5న విద్యార్థుల సమస్యలపై నిర్వహించే ‘ఫీజు పోరు’కు పెద్ద ఎత్తున యువత తరలిరావాలన్నారు. యువజన విభాగం నాయకులు కళాశాలలకు వెళ్లి కూటమి ప్రభుత్వంలో విద్యార్థులు పడుతున్న కష్టాలను తెలియజేయాలన్నారు. పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరుబాట పడదామన్నారు. త్వరలో అన్ని నియోజకవర్గాల్లో యువజన కమిటీలు ఏర్పాటవుతాయన్నారు. కూటమి నేతలు ఇచ్చిన వాగ్దానాలను ఎక్కడికక్కడ ప్రజలకు గుర్తు చేస్తూ ఆందోళన చేయడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఫీజు పోరు పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో యువజన విభాగం అనంతపురం, గుంతకల్లు, కళ్యాణదుర్గం, రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులు శ్రీనివాస్ దత్తా, అబ్దుల్ బషీద్, తలారి చరణ్, రవి, యువజన విభాగం నాయకులు సురేష్, లోక్‌నాథ్‌రెడ్డి, నరేంద్ర, బుల్లె జగదీష్, వినీత్, మణికంఠ, కిరణ్, చంద్రశేఖర్, బిల్లే నాగార్జున, సాకే కుమార్, మైను, తదితరులు పాల్గొన్నారు.
కేసులు, బెదిరింపులకు భయపడొద్దు
ఎవరికి ఇబ్బంది వచ్చినా
పార్టీ తోడుగా ఉంటుంది
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
అనంత వెంకటరామిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment