‘రాయదుర్గం–తుమకూరు’కు నిధులు
రాయదుర్గంటౌన్: కేంద్ర రైల్వే బడ్జెట్‌లో రాయదుర్గం– తుమకూరు రైలు మార్గం నిర్మాణానికి రూ.434.85 కోట్ల నిధులు కేటాయించారు. 206.53 కిలోమీటర్ల మేర తుమకూరు–రాయదుర్గం బ్రాడ్‌గేజ్ రైల్వే లైను పనులు జరుగుతున్నాయి. 2012లో రూ.1,714.50 కోట్ల అంచనాతో పనులు ప్రారంభమయ్యాయి. 94 కిలోమీటర్ల మేర ఆంధ్రప్రదేశ్, 113 కిలోమీటర్లు కర్ణాటక పరిధిలో రైలుమార్గం వెళ్తుంది. ప్రాజెక్ట్ ఖర్చును రైల్వేశాఖ, కర్ణాటక, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 భరించాల్సి ఉంది. అయితే, ఇప్పటివరకూ బడ్జెట్‌లో ప్రతి సారీ తక్కువ నిధులు కేటాయిస్తున్న క్రమంలో పనులు నత్తనడకన సాగుతున్నాయి. దాదాపు 14 సంవత్సరాలుగా నిర్మాణ పనులు జరుగుతుండడం గమనార్హం. పనుల్లో అంతులేని జాప్యం కారణంగా ప్రస్తుతం నిర్మాణ అంచనా వ్యయం రూ.2,450 కోట్లకు చేరుకుంది. 2016లో కళ్యాణదుర్గం వరకు, 2017లో కదిరిదేవరపల్లి వరకు రైలు మార్గం పూర్తయింది. దీంతో తిరుపతి–కదిరిదేవరపల్లి రైలు సర్వీసును ప్రారంభించారు. ప్రస్తుతం దొడ్డహళ్లి నుంచి కర్ణాటకలోని పావగడ సమీపంలోని కె.రాంపుర వరకు 103 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. మరో 104 కిలోమీటర్ల మేర కె.రాంపుర నుంచి పావగడ, మడకశిర, మధుగిరి, కొరటగెరె, ఉరుకెరె, తుమకూరు వరకు రైల్వే పనులు వేగవంతం కావడం లేదు. కొట్టాళం, మడకశిర వరకు రైల్వే లైను పనులు పూర్తయితే ఆంధ్రా సెక్షన్ పూర్తవుతుంది. కర్ణాటకలో కూడా అవసరమైన చోట్ల భూ సేకరణ, బ్రిడ్జిల నిర్మాణం తదితర పనులు జరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రైలు మార్గం నిర్మాణానికి రూ.434.85 కోట్లు కేటాయించడంతో పనులు పుంజుకునే అవకాశం ఉంది.
వేగం పుంజుకోనున్న రైల్వే లైన్ పనులు
Comments
Please login to add a commentAdd a comment