AP: ప్రభుత్వ చదువులకు సలాం | Andhra Pradesh: jagananna animutyalu scheme for merit students | Sakshi
Sakshi News home page

AP: ప్రభుత్వ చదువులకు సలాం

Published Tue, Dec 26 2023 5:17 AM | Last Updated on Tue, Dec 26 2023 8:31 AM

Andhra Pradesh: jagananna animutyalu scheme for merit students - Sakshi

► ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ద్విభాషా పాఠ్యపుస్తకాలను అందించడం గొప్ప పరిణామం. –  ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర విద్యాశాఖ మంత్రి
► ప్రాథమిక స్థాయి నుంచి నాణ్యమైన విద్యను అందించడంలో ఆంధ్రప్రదేశ్‌ పనితీరు అద్భుతంగా ఉంది. –  సంజయ్‌ కుమార్, కేంద్ర పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ కార్యదర్శి
► ఏపీ ప్రభుత్వం గిరిజన విద్యార్థులకు వారి మాతృభాషల్లో (సవర, కొండ, కువి, ఆదివాసీ ఒడియా, కోయ, సుగాలి) ద్విభాషా పాఠ్యపుస్తకాలు అందజేయడం గొప్ప పరిణామం. మనబడి నాడు–నేడు పథకాన్ని మా రాష్ట్రంలోనూ అమలు చేస్తాం. – నవీన్‌ జైన్, విద్యా శాఖ ప్రధాన కార్యదర్శి, రాజస్థాన్‌ 

..ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణలను కొనియాడుతు­న్నారు. విద్యా రంగంలో ఏపీనే తమకు ఆదర్శమని ఎలుగెత్తి చాటుతున్నారు. ఏపీ విద్యా సంక్షేమ పథకాలను తమ రాష్ట్రంలోనూ అమలు చేస్తామని ఘంటాపథంగా చెబుతున్నారు. ఇప్పటికే మహా­రాష్ట్ర, ఒడిశా, అసోం, హరియాణా, ఛత్తీస్‌గఢ్, మిజోరాం, మధ్య­ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, నాగా­లాండ్, గుజరాత్, పుదు­చ్చేరి, కేరళ, తెలంగాణ, అండమాన్‌ –నికోబార్, డామన్‌ డయ్యూ, దాద్రానగర్‌ హవేలీ విద్యాశాఖాధి­కారులు మన విద్యా విధానాలను వారి రాష్ట్రాల్లోనూ, కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ అమలు చేసేందుకు ముందుకు వచ్చారు.

అలాగే అమెరికాలోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాల­యంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై జరిగిన ఉన్నత స్థాయి సదస్సులో 140 దేశాల విద్యావేత్తలు మన ప్రభుత్వ విద్యా సంస్కరణలను కొనియాడారు. జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ బోధన, ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబులు, బైజూస్‌ కంటెంట్, తరగతి గదుల్లో ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ప్యానెళ్లు, స్మార్ట్‌ టీవీల ఏర్పాటు, సీబీఎస్‌ఈ విద్యా విధానం, ఇంగ్లిష్‌ మీడియం బోధన, బాలికలకు స్వేచ్ఛ శానిటరీ న్యాప్కిన్స్‌ పంపిణీని తెలుసుకుని అభినందించారు.

ఈ పథకాలతో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించడమే కాదు.. వాటిని కళ్లారా చూస్తున్న తల్లిదండ్రులు సైతం ప్రభుత్వ చదువులకు సలాం కొడుతున్నారు. పేదరికంతో ఏ ఒక్కరి చదువు ఆగిపోరాదని సంకల్పించిన సీఎం వైఎస్‌ జగన్‌ ఈ నాలుగు­న్నరేళ్లల్లో విద్యా సంస్కర­ణలకు ఏకంగా రూ.71,017 కోట్లు ఖర్చు చేశారు. ఫలితంగా 45 వేల ప్రభుత్వ పాఠశాలలు సమూలంగా తమ రూపు­రేఖలు మార్చుకున్నాయి. వాటి­లో సకల వసతులు వచ్చి చేరాయి. దీంతో 43 లక్షల మంది పేదింటి విద్యార్థుల జీవితాల్లో సరికొత్త వెలుగులు ప్రసరిస్తున్నాయి.  – సాక్షి, అమరావతి

కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ బడి
ప్రభుత్వం మనబడి నాడు–నేడు కింద ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో అనేక రకాల సౌకర్యాలు కల్పించింది. నాడు–నేడు కింద మొదటి దశలో రూ.3,669 కోట్లతో 15,715 పాఠశాలలను అభివృద్ధి చేయగా, రెండో దశలో రూ.8 వేల కోట్లతో 22,344 పాఠశాలలను అభివృద్ధి చేస్తోంది. పనులు పూర్త­యిన వాటిల్లో హైస్కూళ్లకు 62 వేల ఐఎఫ్‌­పీలు, ఎలి­మెంటరీ స్కూళ్లకు 45 వేల స్మార్ట్‌ టీవీలు అందించి డిజిటల్‌ బోధనను ప్రవేశపెట్టింది.

రెండు విడతల్లో ఎనిమిదో తరగతి విద్యార్థులకు బైజూస్‌ కంటెంట్‌తో 9,52,925 ట్యాబ్‌లను అందించింది. పేదింటి పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీ పడేందు­కు వీలుగా 2020–21 విద్యా సంవత్సరంలో ప్రభు­త్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంను అందుబా­టులోకి తెచ్చింది. విద్యార్థులకు ద్విభాషా పాఠ్య పుస్తకాలను అందించింది. దీంతో ఈ విద్యా సంవత్సరంలో జరిగిన రెండు ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎఫ్‌ఏ), సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎస్‌ఏ) పరీ­క్షల్లో 93% మంది విద్యార్థులు ఇంగ్లిష్‌ మీడి­యంలోనే పరీక్షలు రాశారు.

ప్రభుత్వ పాఠశా­లల్లో దాదా­పు 43 లక్షల మంది విద్యార్థులు చదువు­తుండగా వీరిలో 39 లక్షల మందికి పైగా ఇంగ్లిష్‌ మీడి­యంలోనే పరీక్షలు రాస్తుండడం విశేషం. మరోవైపు బడికి దూరమవుతున్న పిల్లలను తిరిగి చేర్పించేందుకు, వారి చదువులు తల్లిదండ్రులకు భారం కాకూ­­డదని 44,48,865 మంది తల్లుల ఖాతాల్లో ఏటా రూ.15 వేల చొప్పున ప్రభుత్వం జగనన్న అమ్మఒడి కింద నగదు జమ చేస్తోంది.

దీంతో గతేడాది కంటే ఈ ఏడాది ఒకటి నుంచి ఇంటర్‌ వరకు 1,50,005 మంది విద్యార్థులు అధికంగా చేరారు. అలాగే గత విద్యా సంవత్సరంలో పది, ఇంటర్‌ బోర్డు పరీక్షల్లో ప్రతిభ చాటినవారిని ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరిట ప్రభుత్వం సత్కరించింది. అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలో ప్రతిభావంతులను ఎంపిక చేసి ప్రభుత్వం అమెరికా పర్యటనకు పంపించింది.

గతంలో ఇన్ని సదుపాయాలు లేవు..
ప్రభుత్వ బడుల్లో ఇన్ని సదుపాయాలు, విద్యా సంస్కరణలు గతంలో ఎప్పు­డూ లేవు. ఇప్పుడు ఇంగ్లిష్‌ మీడి­యం, సీబీఎస్‌ఈ సిల­బస్‌ను సైతం గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. మా పెద్దమ్మాయి అరుణ కేజీబీవీలో పదో తరగతి ఇంగ్లిష్‌ మీడియంలో చదువుతోంది.

చిన్నమ్మాయి చైత్ర ప్రణవి ప్రభుత్వ బడిలోనే తొమ్మిదో తరగతి సీబీఎస్‌ఈ సిలబస్‌లో విద్యనభ్యసిస్తోంది. ఇంత ఉత్తమ చదువులు నాలాంటి సామాన్యులకు అందుకోవడం గతంలో సాధ్యమయ్యేది కాదు. కానీ పేద, మధ్య తరగతి పిల్లల చదువుల భారం పూర్తిగా ప్రభుత్వమే చూసుకుంటోంది. ఇప్పుడు ప్రైవేటు కంటే ప్రభుత్వ స్కూళ్లే అద్భుతంగా ఉన్నాయి. – రుత్తల పాపయ్య, అల్లిపూడి, కాకినాడ జిల్లా

ఇలాంటి గొప్ప చదువులు మాకు వరం
అటవీ ప్రాంతమైన మా సీలేరు గ్రామం ఇంగ్లిష్‌ చదువులకు చాలా దూరం. జగన్‌ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్‌ మీడియం వచ్చింది. ఇప్పుడు సీలేరు జిల్లా పరిషత్‌ హైస్కూల్లో ఇంగ్లిష్‌ మీడియంలోనే చదువు చెబుతున్నారు. వచ్చే ఏడాది పదో తరగతి కూడా ఇంగ్లిష్‌లోనే ఉంటుందన్నారు. నా కూతురు జ్యోత్స ్న స్థానిక జెడ్పీ స్కూల్లో 9వ తరగతి ఇంగ్లిష్‌ మీడియంలో చదువుతోంది. ఇప్పుడు ఇంగ్లిష్‌ బాగా మాట్లాడుతోంది. ఇది మాకెంతో గర్వంగా ఉంది. ఇలాంటి గొప్ప చదువులు మాలాంటి వారికి వరం. – పెయ్యల సింహాద్రి, సీలేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా

పౌష్టికాహారం.. గోరుముద్ద
ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు నాణ్య­మైన పౌష్టికాహారం అందించాలనే గొప్ప ఆలోచ­నతో 2020, జనవరి 1న రాష్ట్ర ప్రభుత్వం ‘జగనన్న గోరుముద్ద’ పథకానికి శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వం మధ్యాహ్న భోజనంలో రోజూ సాంబారు, అన్నం మాత్రమే పెట్టేది.

వైఎస్సార్‌­సీపీ ప్రభు­త్వం ఇప్పుడు వారానికి 16 రకాల ఐటె­మ్స్‌­తోపాటు ఫోర్టిఫైడ్‌ సార్టెక్స్‌ బియ్యంతో భోజ­నం పెడుతోంది. సోమవారం నుంచి శనివా­రం వరకు రోజుకో మెనూతో విద్యార్థులకు వేడిగా రుచి, శుచి­తో పోషకాహారాన్ని అందిస్తోంది. అలాగే వారిలో రక్తహీనతను అరికట్టడానికి వారంలో 3 రోజులు బెల్లంతో చేసిన రాగి జావ, మూడు రోజులు చిక్కీ, వారంలో ఐదు రోజులు ఉడికించిన గుడ్డును తప్ప­నిసరి చేసింది. ఎలా వండితే నచ్చుతుందో విద్యా­ర్థుల అభిప్రాయాలు తెలుసుకుని ఆ మేరకు వంటలో మార్పులు సైతం చేశారు.

పర్యవేక్షణ కోసం ‘ఇంటిగ్రేటెడ్‌ మానిట­రింగ్‌ సిస్టం ఫర్‌ మిడ్‌ డే మీల్స్‌ అండ్‌ శానిటేషన్‌ (ఐఎంఎంఎస్‌)’ యాప్‌ను అందుబాటు­లోకి తెచ్చారు. జగనన్న గోరుముద్ద కోసం ఏటా సగటున రూ.1,400 కోట్లు చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.6,995.34 బడ్జెట్‌ను ప్రభు­త్వం కేటా­యించింది. గత టీడీపీ ప్రభుత్వం మధ్యా­హ్న భోజ­నం కోసం ఏటా చేసిన రూ.450 కోట్లు ఖర్చు కంటే ఇది నాలుగు రెట్లు అధికం. ప్రభుత్వ బడులకు ప్రతి గురువారం స్థానిక ప్రభుత్వ వైద్య­శాల, విలేజ్‌ క్లినిక్‌ నుంచి సిబ్బంది వచ్చి విద్యా­ర్థులకు వైద్య పరీక్షలు కూడా చేస్తున్నా­రు. రక్తహీ­నతను అరికట్టేందుకు మాత్రలూ ఇస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement