Eenadu and Yellow Media Fake News On Houses For Poor People - Sakshi
Sakshi News home page

‘ఈనాడు’కు ఇదెక్కడి పైత్యం? 

Published Tue, Jun 14 2022 5:26 AM | Last Updated on Tue, Jun 14 2022 2:39 PM

Eenadu And Yellow Media Fake News On Houses For Poor People - Sakshi

చిత్తూరు జిల్లా నాగరాజుకుప్పం–2 లే అవుట్‌లో తుది దశలో ఇళ్ల నిర్మాణాలు

‘పేదలందరికీ ఇళ్ల కల్పనలో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉంది. సీఎం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోంది’..ఈ వ్యాఖ్యలు.. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం అమలు, రాష్ట్ర అభివృద్ధిపై కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి హరదీప్‌సింగ్‌ పూరి ఎప్పుడో కాదు.. తాజాగా ఆదివారం చేసినవి. పేదల ఇళ్ల నిర్మాణంలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వమే ఇలా కితాబిస్తుంటే.. చంద్రబాబుకు అడ్డగోలుగా కొమ్ముకాసే ఈనాడు, ఈటీవీ మాత్రం పథకం నత్తనడకన నడుస్తోంది, లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారంటూ ఎప్పటిలాగే దుష్ప్రచారం చేస్తున్నాయి.

రాష్ట్ర పథకాలకు జాతీయ స్థాయిలో ఎక్కడాలేని గుర్తింపు, ప్రశంసలు లభిస్తుంటే పచ్చమీడియా మాత్రం ప్రజలపై పచ్చివిషం కక్కుతోంది. ‘పునాదే దాటని పేదిల్లు’.. అంటూ సోమవారం ఆ విషపత్రిక ఓ కథనం వండి వార్చింది. ఈ కథనంలో పలు అంశాలను ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న అక్కసు, కడుపుమంటను అక్షరం అక్షరంలో ప్రదర్శించింది. ఆ కథనంలో ప్రస్తావించిన అంశాలు.. వాటి వెనకున్న ఈనాడు చెప్పని అసలు వాస్తవాలపై ‘ఏది నిజం’ చదవండి..

సాక్షి, అమరావతి: ఈనాడు : పథకం నత్తనడకన సాగుతోంది..
నిజం : తొలిదశ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించి ఏడాదిన్నర కావస్తోంది. ఈ ఏడాదిన్నరలో గత ఏడాది మార్చి నుంచి జూన్‌ మధ్య కరోనా రెండో దశ వ్యాప్తితో పనులకు ఆటంకం ఏర్పడింది. కరోనా వ్యాప్తి నెమ్మదించి పనులు సజావుగా సాగుతున్న సమయంలో టీడీపీ నాయకులు కుట్రపూరితంగా కోర్టులకు వెళ్లి పథకాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో తిరిగి అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ మధ్య పథకం పూర్తిగా నిలిచిపోయింది. ఈ ఏడాది ప్రారంభంలో ఒమిక్రాన్‌ రూపంలో మరోమారు కరోనా వ్యాపించింది. ఈ కారణాలతో ఏడాదిన్నరలో అధిక కాలం ఇళ్ల నిర్మాణాలు సజావుగా సాగలేదు. ఇక ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల నుంచి పనులు చకచకా సాగుతున్నాయి. దీంతో ఒక్క మే నెలలోనే 30 వేల ఇంటి నిర్మాణాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం రోజుకు రూ.25 కోట్ల మేర పనులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 60,783 ఇళ్లు పూర్తయ్యాయి.

ఈనాడు: లేఅవుట్‌లలో విద్యుత్, నీటి సరఫరా లేదు. సదుపాయాలు లేక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు..
నిజం: 17వేలకు పైగా వైఎస్సార్, జగనన్న కాలనీల్లో పథకం కింద 30.60 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ నేపథ్యంలో ఇళ్ల నిర్మాణాలకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేలా లేఅవుట్‌లలో తాత్కాలిక సదుపాయాల కల్పనకు రూ.1,200 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా లేఅవుట్‌లలో విద్యుత్‌ సరఫరా, బోర్లు వేయడం, మోటార్లు బిగించడం చేపడుతున్నారు. ఇప్పటికే రూ.450 కోట్లు ఖర్చుచేసి తొలిదశ నిర్మాణాలు చేపడుతున్న లేఅవుట్‌లలో తాత్కాలిక సదుపాయాల కల్పన చేపట్టారు. రూ.32వేల కోట్లతో కాలనీల్లో శాశ్వత సదుపాయాలను ప్రభుత్వం కల్పించనుంది. ఇందులో భాగంగా విద్యుత్‌ సదుపాయాల కల్పనకు రూ.4,260 కోట్లు కేటాయించారు. విద్యుత్‌ సదుపాయాల కల్పనకు ఇప్పటికే టెండర్లు పూర్తయి, పనులు కూడా ప్రారంభించారు. 

ఈనాడు : కేంద్ర సాయానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదు..
నిజం: కేంద్ర ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి రూ.1.50 లక్షల చొప్పున సాయం చేస్తోంది. ఇందుకు అదనంగా రూ.30 వేలను రాష్ట్ర ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి సాయం అందిస్తోంది. ఇది కాకుండా.. పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.1.5 లక్షల రిజిస్ట్రేషన్‌ విలువ గల ప్లాట్లను 30.60 లక్షల మంది పేదలకు ఉచితంగా పంపిణీ చేసింది. ఈ మొత్తం ప్లాట్ల మార్కెట్‌ విలువను పరిశీలిస్తే.. రూ.56,102 కోట్ల మేర ఉంటుందని అంచనా. ప్లాట్లు పంపిణీ చేసిన లేఅవుట్‌లు మెజారిటీ శాతం ఊళ్లకు దగ్గరగా, ప్రైమ్‌ ఏరియాల్లోనే ఉన్నాయి. ఉదా.. బాపట్ల జిల్లా కేంద్రంలోని ప్యాడిసన్‌పేటలో కత్తిపూడి–ఒంగోలు నేషనల్‌ హైవే 216కు పక్కనే లేఅవుట్‌లో ప్లాట్‌ మార్కెట్‌ ధర రూ.10 లక్షలు పలుకుతోంది. అలాగే, తిరుపతి–శ్రీకాళహస్తి జాతీయ రహదారి పక్కన 5,896 మందికి 220 ఎకరాల్లో ప్లాట్లు పంపిణీ చేశారు.

ఇందులో నిర్మాణాలు చేపట్టడానికి వీలుగా 30 బోర్లు వేసి వాటికి విద్యుత్‌ మోటార్లను బిగించి, ప్లాట్లకు పైప్‌లైన్లు వేశారు. దీంతో నేటి వరకూ చిల్లిగవ్వ ఆస్తిలేని పేదలకు ఒక్కసారిగా రూ.10లక్షలకు పైగా ఆస్తి సమకూరుతోంది. ఇక ఊళ్లకు దగ్గరగా భూములు లభించని చోట మాత్రమే విధిలేని పరిస్థితుల్లో కొంతదూరంగా ప్రభుత్వం లేఅవుట్లను ఏర్పాటుచేసింది. ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు 3 శాతం వడ్డీకి రూ.35వేలు బ్యాంకు రుణసాయం చేస్తోంది. రుణాలు పొందేందుకు వీలుగా సిబిల్‌ స్కోర్‌ నుంచి పేదలకు మినహాయింపు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

ఇందుకు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పటివరకూ 3,70,826 మంది పేదలకు రూ.1,370.39 కోట్ల మేర రుణాలను ప్రభుత్వం అందించింది. రూ.15వేలు విలువ చేసే 20 టన్నుల ఇసుకను లబ్ధిదారులకు ఉచితంగా అందిస్తోంది. అదే విధంగా సబ్సిడీపై ఇనుము, సిమెంట్, ఇతర వస్తువులను ప్రభుత్వమే సరఫరా చేస్తోంది. తద్వారా ఒక్కో లబ్ధిదారుడికి రూ.40వేల మేర లబ్ధి చేకూరుతోంది. మొత్తంగా 12 రకాల వస్తువులను సబ్సిడీ కింద రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అందిస్తోంది.

పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ సుమారు 2000 మంది లబ్ధిదారులకు నిర్మిస్తున్న లే అవుట్‌ 

ఈనాడు : ధరల పెరుగుదలతో పేదలపై భారం..
నిజం: గత కొద్దినెలలుగా నిర్మాణ సామాగ్రి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ ప్రభావం పేదలపై పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 20 టన్నుల ఇసుకను ఉచితంగా సరఫరా చేయడంతో పాటు, బస్తా సిమెంట్‌ రూ.225 చొప్పున ఇటీవల వరకూ ప్రభుత్వం సరఫరా చేసింది. ఇటీవల కాలంలో సిమెంట్‌ ధరలు మళ్లీ విపరీతంగా పెరగడంతో బస్తా సిమెంట్‌ను రూ.260కు అందిస్తున్నారు. ఇనుమును కంపెనీని బట్టి కిలో రూ.53, రూ.63, రూ.72లతో సరఫరా చేస్తున్నారు. మా ర్కెట్‌ ధరలతో పోలిస్తే కిలోకు రూ.20 తక్కువ. 

ఈనాడు: ఆప్షన్‌–3 లబ్ధిదారుల కుదింపు..
నిజం: ప్రారంభంలో ఆప్షన్‌–3 ఎంచుకున్న లబ్ధిదారులు చాలావరకూ స్వచ్ఛందంగా విరమించుకున్నారు. చివరకు 3.27 లక్షల మంది మాత్రమే ఆప్షన్‌–3కి కట్టుబడి ఉన్నారు. దీంతో వీరి ఇళ్ల నిర్మాణ బాధ్యతను గృహ నిర్మాణ శాఖ చేపట్టింది. లబ్ధిదారులను గ్రూపులుగా ఏర్పాటుచేసి కాంట్రాక్టర్లను అనుసంధానించి ఇళ్ల నిర్మాణాలు చేపడుతోంది. 

ఈనాడు చెప్పినవి అసత్యాలు
డబ్బుల్లేక ఇంటి నిర్మాణం ఆగిపోయిందని ఈనాడులో వచ్చిన కథనం అసత్యాల పుట్ట. నాకు ప్రభుత్వం నుంచి రుణం మొదటి వాయిదా పడింది. ఇప్పటివరకు నాకు రూ.70వేలు మంజూరైంది. 10 టన్నుల ఇసుక అందించారు. 343 కేజీల ఇనుము, 40 బస్తాల సిమెంట్‌ సబ్సిడీపై ఇచ్చారు. అంతేకాక.. స్త్రీ నిధి నుంచి రూ.50 వేల రుణం మంజూరైంది. జగనన్న సాయంవల్లే నేను ఇల్లు కట్టుకుంటున్నాను. ఈ విషయాలే ఈనాడు వారికి చెప్పాను. అయితే, వారు ఎలా రాసుకున్నారో నాకు తెలీదు.     
    – జుత్తిగ పద్మావతి, పాలకోడేరు, పశ్చిమ గోదావరి జిల్లా
లబ్ధిదారు జుత్తిగ పద్మావతితో మాట్లాడుతున్న భీమవరం ఆర్డీఓ దాసిరాజు 


(ఇక జుత్తిగ పద్మావతి విషయాలనే భీమవరం ఆర్డీఓ దాసిరాజు కూడా చెప్పారు. 
ఈనాడులో వచ్చిన వార్తలు నిజం కావని ఆయన స్పష్టంచేశారు. భీమవరం ఆర్డీఓ దాసిరాజు ఆమెను కలిసి వివరాలు సేకరించారు.) 

ఇమాములు ఇంటికి రూ.70వేల మేర సాయం
ఈనాడులో పేర్కొన్న కర్నూల్‌ జిల్లా మద్దికెర గ్రామానికి చెందిన ఇమాములు భార్య కవిత పేరిట ఇల్లు మంజూరైంది. వీరికి ఇప్పటివరకూ 10 టన్నుల ఇసుక ఉచితంగా, 25 బస్తాల సిమెంట్‌ సబ్సిడీపై సరఫరా చేశారు. దీనితో పాటు ఇంటి నిర్మాణ బిల్లు రూ.64,200 మంజూరు చేశారు. ఇలా మొత్తంగా రూ.70,875 మేర ఇమాములుకు లబ్ధి చేకూరింది.

సబ్సిడీతో తగ్గిన భారం
ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణాలకు కావాల్సిన సిమెంట్, ఐరన్‌ను సబ్సిడీపై ప్రభుత్వం అందిస్తోంది. దీంతో మాపై చాలా భారం తగ్గుతోంది. ఇప్పటికే ఇంటి నిర్మాణం దాదాపు 90 శాతం పూర్తయింది. మరికొన్ని రోజుల్లో నా సొంతింటి కల నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉంది.
    – జె. రేణుక, కడప, వైఎస్సార్‌ జిల్లా

పదేళ్లుగా మాకు ఇల్లు లేదు
గతంలో మాకు ఎవ్వరూ ఇల్లు మంజూరు చేయలేదు. జగనన్న సీఎం అయ్యాక మా కల నెరవేరింది. గత ఏడాది ఇంటి  కోసం సచివాలయంలో దరఖాస్తు చేసుకోగానే స్థలం ఇచ్చారు. అలాగే.. ఇల్లు కట్టుకునేందుకు సహాయం చేస్తున్నారు. ఇంటి నిర్మాణానికి పునాది వేసుకున్నాం. బిల్లు కూడా పడింది. సిమెంటు ఇచ్చారు. గ్రూప్‌ తరఫున రుణం కూడా అందించారు.
 – నస్రీన్, యాదమరి, చిత్తూరు జిల్లా

జగనన్నకు రుణపడి ఉంటాం
నాకు వివాహమై దాదాపు 20 ఏళ్లు అయింది. ఒక కుమారుడు, కుమార్తె. పెళ్లయి నప్పటి నుంచి అద్దె ఇంట్లోనే ఉంటున్నాం. ఇంటి స్ధలం కోసం ఎన్నిసార్లు అధికారులను అడిగినా గతంలో ఎవ్వరూ పట్టించుకోలేదు. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ఇంటి స్థలం మంజూరైంది.   
 – దోమ లక్ష్మి, మార్టేరు, పెనుమంట్ర మండలం, పశ్చిమ గోదావరి జిల్లా

విలువైన స్థలం ఇచ్చారు
పల్నాడు జిల్లా వినుకొండ రోడ్డులోని జగనన్న కాలనీలో ఎంతో విలువైన స్థలం ఇచ్చారు. కలలో కూడా నేను ఇల్లు కట్టుకుంటానని అనుకోలేదు. ఇంటి స్థలమిచ్చి,æ నిర్మాణం కోసం డబ్బులిస్తున్నారు. ఇల్లు మొదలు పెట్టాను. పూర్తిచేసి ఆ ఇంట్లోకి వెళ్తాను. చాలా సంతోషంగా ఉంది.   
 – చెరుకూరి లక్ష్మి, లబ్ధిదారురాలు, నరసరావుపేట 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement