మృతి చెందిన రవి, గీతా సహస్ర (ఫైల్)
సత్యనారాయణపురం (విజయవాడ సెంట్రల్): తాను లేని లోకంలో జీవించలేదని అనుకున్నాడో ఏమో పదేళ్లు అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురి మెడకు కర్కశంగా ఉరితాడు బిగించాడు ఆ తండ్రి. తనతోపాటే తనయనూ తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లాడు. నన్ను క్షమించు తల్లీ అంటూ సూసైడ్ నోట్ రాసి ఈ లోకం నుంచి నిష్క్రమించాడు. ఈ హృదయవిదారక ఘటన స్థానిక శ్రీనగర్‌కాలనీలో శుక్రవారం రాత్రి జరిగింది. భార్య అనారోగ్యం, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. పోలీసుల కథనం ప్రకారం.. జాగాని రవి(38) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి భార్య ధరణి, కూతురు గీతాసహస్ర(10)తో కలసి లాక్‌డౌన్‌లో స్థానిక శ్రీనగర్‌కాలనీకి వచ్చాడు.
ఇక్కడే నివాసముంటున్నాడు. భార్య ఆరోగ్య పరిస్థితి క్షీణించడం, ఉద్యోగం లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల వల్ల తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి కూతురుతోపాటు తానూ చనిపోవాలని నిర్ణయించుకుని తమ చావుకు ఎవరూ కారణం కాదని, తన కిడ్నీలు భార్యకు, ఇతర అవయవాలు అవసరంలో ఉన్న వారికి దానం చేయాలని కూతురినీ తనతోపాటు చంపుతున్నందుకు ‘క్షమించు బుజ్జి తల్లి’ అని సూసైడ్ నోట్ రాశాడు. ముందు కూతురు నోటికి ప్లాస్టర్ వేసి మెడకు ఉరితాడు బిగించాడు.
ఆ తర్వాత అతనూ ఉరివేసుకున్నాడు. ఇద్దరూ మరణించారు. శనివారం విషయం తెలుసుకున్న ధరణి భర్త, కూతురు విగతజీవులు పడి ఉండడం చూసి కన్నీరుమున్నీరైంది.పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే మృతుల ముఖాలకు, కాళ్లకు గుడ్డలు, తాళ్లు కట్టి ఉండడంతో వీరు ఆత్మహత్య చేసుకున్నారా? లేక హత్యా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి:
దేవినేని ఉమాపై సీఐడీ కేసు
‘మేం చచ్చిపోతున్నాం.. మా పార్ట్స్ నా భార్యకు ఇవ్వండి’
Comments
Please login to add a commentAdd a comment