రాప్తాడురూరల్: ఐదు నిముషాలపాటు అత్తారింట్లో గడిపి ఉన్నా ప్రాణాలు దక్కేవని ఈనెల 11న ఆత్మకూరు మండలం పంపనూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహమ్మద్ షఫి స్నేహితులు, బంధువులు విలపిస్తున్నారు. ఊహించని విధంగా క్షణాల్లో కళ్లెదుటే స్నేహితుడు అనంత లోకాలకు వెళ్లిపోవడాన్ని స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి కాలనీ పంచాయతీ నందమూరినగర్‌కు చెందిన ఎర్రిస్వామి, జిలేఖ దంపతులకు ఏకైక కుమారుడు మహమ్మద్ షఫి.
పెయింటర్ అయిన షఫీకి ఆరేళ్ల కిందట పంపనూరుకు చెందిన రేష్మాతో వివాహమైంది. వీరికి ఐదేళ్ల కుమారుడు, మూడేళ్ల కూతురు సంతానం. వివాహం అయినప్పటి నుంచి షఫీ కుటుంబం వేరుగా ఉంటోంది. రేష్మా స్నేహితురాలి వివాహం కోసమని ఈనెల 11న రాత్రి పంపనూరుకు ద్విచక్రవాహనంలో వెళ్లాడు. భార్య, పిల్లలను అత్తారింట్లో దింపి ద్విచక్రవాహనం అక్కడే ఉంచి స్నేహితులతో కలిసి అలా రోడ్డుపైకి వచ్చాడు.
కళ్లెదుటే ఊహించని ప్రమాదం..
షఫీ స్నేహితులతో కలిసి రోడ్డుపై నిలబడి మాట్లాడుతుండగా, మృత్యువు రూపంలో వచ్చిన బొలెరో వాహనం క్షణాల్లో షఫీ మీదకు దూసుకొచ్చింది. హఠత్పారిణామంతో స్నేహతులు తేరుకునేలోపే షఫీ అక్కడిక్కడే మృతి చెందాడు. అత్తారింట్లో ఐదు నిముషాలు గడిపి ఉన్నా, ఈ ప్రమాదం సంభవించేది కాదని బంధువులు, స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడాన్ని తల్లిదండ్రులు జీరి్ణంచుకోలేక పోతున్నారు.
తన స్నేహితురాలి పెళ్లికి వచ్చి ఈ విషాద ఘటన చోటు చేసుకోవడాన్ని మృతుడి భార్య రేష్మా తలచుకొని కుమిలి కుమిలి ఏడుస్తోంది. కాగా వైఎస్సార్ బీమా కింద మృతుడి కుటుంబానికి రూ. 5 లక్షల వరకు మంజూరవుతుంది. ఎమ్మెల్యే తోపుదుర్తిప్రకాష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ రాధమ్మ, నాయకులు ధనుంజయయాదవ్ హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment