వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అన్నదాతల సంక్షేమానికి చేపట్టిన చర్యలన్నింటినీ మనçస్ఫూర్తిగా సమర్థిస్తున్నా. ప్రత్యేకించి రైతుభరోసా కింద అందిస్తున్న పెట్టుబడి సాయం, ధరల స్థిరీకరణ నిధి, ఉచిత పంటల బీమా వంటి పథకాలు అద్భుతం. వ్యవసాయ సంక్షోభం నుంచి రైతుల్ని కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ చాలా బాగున్నాయి. వాటన్నింటినీ ప్రశంసిస్తున్నా. ఇందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా..
ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు రాకుండాపోతే రైతు పరిస్థితి ఎలా ఉంటుంది? అటువంటప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత పాలకులదే కదా.. ఆ పని ఏ ప్రభుత్వం చేసినా హర్షణీయమే. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా.ఆ విధానాలన్నీ నచ్చాయి కనుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన ఏపీ వ్యవసాయమిషన్‌లో సభ్యుడిగా ఉన్నా.. ప్రముఖ జర్నలిస్టు, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, ఏపీ వ్యవసాయ మిషన్ సభ్యుడు డాక్టర్ పాలగుమ్మి సాయినాథ్ మాటలివి.
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు – వ్యవసాయంపై వాటి ప్రభావం గురించి గుంటూరులో ఇటీవల ఏర్పాటుచేసిన జాతీయ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఈ గ్రామీణ జర్నలిస్టు సాయినాథ్ ‘సాక్షి ప్రత్యేక ప్రతినిధి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. వ్యవసాయ చట్టాల రద్దుపై జరుగుతున్న పోరాటం మొదలు మీడియా తీరుతెన్నుల వరకు అనేక అంశాలపై ఆయన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పారు. పార్లమెంటు సంపన్నుల పరమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్య్రమైతే వచ్చిందిగానీ స్వేచ్ఛ అందరికీ రాలేదన్నారు. నోరూవాయ లేని సామాన్యుడికి గొంతుకగా ఉండాల్సిన మీడియా సైతం కార్పొరేట్ల కబంధహస్తాల్లో చిక్కిందని చెప్పారు. స్వాతంత్య్రం కోసం రక్తమాంసాలను తృణప్రాయంగా త్యజించిన త్యాగధనులకు ఈవేళ దేశంలో నెలకొన్న పరిస్థితి క్షోభకలిగిస్తోందన్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని చెప్పారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన ఇంకా ఏమన్నారంటే..
‘రైతు కోసం ఏంచేసినా మంచిదే
రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేల) ఏర్పాటు హర్షణీయం. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడా ఆ హామీని విస్మరించింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాగు వ్యయాన్ని తగ్గించేందుకు పలు చర్యలు చేపట్టింది. వాటిల్లో ఆర్బీకేలు ఒకటి. వాటిని ముందుకు తీసుకెళ్లాలి. వ్యవసాయ మిషన్‌లో నేనూ సభ్యుడిగా ఉన్నా. రైతును క్షేమంగా ఉంచేందుకు ఏంచేసినా మంచిదే. ఆర్బీకేలు ఎలా పనిచేస్తున్నాయో నేను తెలుసుకుంటున్నా.
వ్యవసాయ చట్టాలను అందరూ వ్యతిరేకించాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను ఏపీ సహా అన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాలి. వ్యవసాయం రాష్ట్ర పరిధిలోని అంశం. వ్యవసాయంపై ఏదైనా చట్టాన్ని తేవాలంటే దేశంలోని మూడింట రెండు వంతుల రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదం తెలపాలి. అటువంటిదేమీ లేకుండానే కేంద్రం చట్టాలు తెచ్చింది. ఈ తీరును నిరసించాలి. ఆ చట్టాల్ని అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. అవి అమల్లోకి వస్తే చిన్న, సన్నకారు రైతులు ప్రత్యేకించి కౌలురైతులు బాగా చితికిపోతారు. అందుకే ఈ చట్టాలను వ్యతిరేకించమని ఈ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.
అది సంపన్న రైతుల పోరాటమా?.. మతిలేని మీడియా ప్రచారమది..
ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో 8 నెలలుగా సాగుతున్న రైతు పోరాటంపై ఐఎంఎఫ్ డైరెక్టర్‌గా ఉన్న సూర్జత్ భల్లా వంటి అపర మేధావులు, కొన్ని మతిలేని మీడియా సంస్థలు పేలేవి అవాకులు చెవాకులు. అది సంపన్న రైతుల పోరాటమని, నాలాంటి వాళ్లు సంపన్న రైతుల సోషలిజం కోసం పోరాడుతున్నామంటూ వెటకారమాడుతున్నారు. వాళ్ల మాదిరిగా కార్పొరేట్ల సోషలిజం కోసం పోరాడలేం కదా.. అందుకే రైతులకు మద్దుతు ఇస్తున్నాం. ఒక్కసారి పంజాబో, హరియాణానో, ఉత్తరప్రదేశో వెళ్లి చూస్తే ఈ పోరాటాన్ని కొనసాగించేందుకు సాదాసీదా రైతులు ఎంత కష్టపడుతున్నారో, తాము తినకపోయినా పర్లేదు, ఈ రూపాయి ఉంచండని ఎంతలా దాతృత్వం చూపిస్తున్నారో తెలుస్తుంది. రైతు ఏడాదిలో సంపాదించే మొత్తాన్ని ఒక్కరోజులో సంపాయించే వాళ్లకు ఢిల్లీ పోరాటం ఏమర్థమవుతుంది? ప్రజాస్వామ్య చరిత్రలో అదో మహత్తర పోరాటం. దాని విలువ తెలుసుకోవాలంటే చాలా కష్టపడాలి.
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
ప్రజాస్వామ్యానికి దేవాలయమంటున్న పార్లమెంటులో సామాన్యులకు చోటులేకుండా పోతోంది. 2004లో 32 శాతం మంది ఎంపీలు కోటీశ్వరులైతే 2019 నాటికి ఇది 88 శాతానికి చేరింది. సమాజంలో అత్యధికులుగా ఉన్న వర్గాలకు వీళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే భయం వేస్తోంది. పేద ప్రజల సమస్యలు ఎలా పరిష్కారమవుతాయన్నదే నా ఆవేదన. స్వాతంత్య్ర సమరయోధులు, త్యాగశీలురు ఇటుక ఇటుక పేర్చుకుంటూ వచ్చిన ప్రజాస్వామ్య సౌధాన్ని కూల్చేస్తున్నారు. స్వాతంత్య్రమైతే వచ్చిందిగానీ స్వేచ్ఛ కొందరికే పరిమితమైంది. అయినప్పటికీ ఈ దేశ ప్రజలు చాలా శక్తిమంతులనే నా భావన. 1971లో దక్షిణ ముంబై నుంచి నావల్ టాటా అనే సంపన్నుడు పార్లమెంటుకు పోటీచేశారు. ఆయనకు ఎంత మెజారిటీ రావచ్చని పోల్ పండిట్లు లెక్కిస్తుంటే ఆ ప్రాంత ప్రజలు అనామకుడైన ఓ ట్రేడ్ యూనియన్ లీడర్ కైలాష్ నారాయణ్‌ను గెలిపించారు. అందువల్ల ఈ దేశ ప్రజలపై నాకు అపార విశ్వాసం ఉంది. సమయం వచ్చినప్పుడు తప్పక తమ ఆయుధాన్ని బయటకు తీస్తారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారు..’ అని సాయినాథ్ పేర్కొన్నారు.
పెట్టుబడి సాయం అద్భుతం
రైతులకు పెట్టుబడి సాయం అందించాలని ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ‘వైఎస్సార్ రైతుభరోసా’ పథకం, ధరల స్థిరీకరణ నిధి, కనీస మద్దతు ధరలకు పంటల కొనుగోలు వంటివి ప్రాధాన్యత కలిగినవి. వాటికి నేను పూర్తి మద్దతు ఇస్తున్నా. వీటితోపాటు చాలా సానుకూల నిర్ణయాలున్నాయి. కరోనా మహమ్మారి ప్రబలిన నేపథ్యంలో ఏడాది కాలంగా అవి ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకోలేదు. అవి ఎలా పనిచేస్తున్నాయో చూడాల్సి ఉంది. పథకాల వరకైతే అవి అద్భుతం.
Comments
Please login to add a commentAdd a comment