చిలకలపూడి (మచిలీపట్నం): గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించింది రైతుల కోసమా.. రాజకీయం కోసమా అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పేర్ని నాని నిలదీశారు. ఆ పర్యటనలో పవన్ రైతుల గురించి మాట్లాడింది తక్కువ.. రాజకీయం గురించి మాట్లాడింది ఎక్కువ అని మండిపడ్డారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్‌లో పేర్ని నాని శుక్రవారం మీడియాతో మాట్లాడారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న రైతులను పరామర్శించేందుకు వచ్చిన పవన్ రైతుల గురించి కాకుండా రాజకీయం కోసమే ఎక్కువ వ్యాఖ్యలు చేశారని ధ్వజమెత్తారు. పార్టీ స్థాపించిన నాటి నుంచే జనసేన పార్టీకి బలం లేదన్నారు.
2019 ఎన్నికల్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లను వైఎస్ జగన్‌కు వెళ్లకుండా చేయడానికి అన్ని స్థానాల్లో జనసేన పోటీ చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా చంద్రబాబుతో లాలూచీ పడి ఆయన కోసమే పవన్ రాజకీయాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. టెంట్‌హౌస్‌లో ఏ విధంగా సామాన్లు అద్దెకిస్తారో ఆ విధంగా పవన్ తన పార్టీని టెంట్‌హౌస్ పార్టీగా నడుపుతున్నారన్నారు. మంచి భవిష్యత్తు ఉన్నవారు వారి ఉద్యోగాలను సైతం వదిలిపెట్టి మరీ జనసేన పార్టీ కోసం పనిచేస్తున్నారని పేర్ని నాని ఆవేదన వ్యక్తం చేశారు.
పవన్ ముఖ్యమంత్రి కావాలనే ఆశతో వారు పార్టీలో ఉంటున్నారని.. ఆయన మాత్రం చంద్రబాబు కోసం పనిచేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగస్తులు పవన్ మాయలో పడొద్దన్నారు. వారి జీవితాలను బాగు చేసుకుని.. తల్లిదండ్రుల ఆశయాలను నిలబెట్టాలని విజ్ఞప్తి చేశారు.
పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధితో పనిచేస్తే ప్రజలు ఎప్పటికైనా ఆదరిస్తారన్నారు. అయితే పవన్ రూ.100 కోట్లు వచ్చే వ్యాపారాన్ని వదులుకుని ప్రజల కోసం అంకితభావంతో పనిచేస్తున్నానని చెప్పి మళ్లీ సినిమాలు చేసుకుంటున్నారని గుర్తు చేశారు. ఆర్భాటంగా వారాహి వాహనాన్ని తీసుకువచ్చి ప్రచారం చేస్తానని మాయమాటలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు ప్రజల్లోకి వస్తానని పవన్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
ఇదీ చదవండి: పవన్ లొంగిపోయింది ఇందుకేనా?
Comments
Please login to add a commentAdd a comment