సాక్షి, తాడేపల్లి: కూటమి నేతలు కమిషన్ల కోసమే సిగపట్లు పట్టుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ ఆరోపించారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గం.. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గాల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుపై తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పుత్తా శివశంకర్ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా పుత్తా శివశంకర్ మాట్లాడుతూ.. ‘కూటమి నేతలు కమీషన్ల కోసం కొట్టుకుంటున్నారు. ఆదినారాయణరెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి వర్గాలు ఖనిజ సంపదను దోచుకుంటున్నాయి. కమీషన్లు ఇవ్వలేదని కంపెనీల దగ్గరకు వెళ్లి ఆదినారాయణ రెడ్డి మనుషులు దాడి చేశారు. జేసీ బ్రదర్స్ వైన్ షాపుల నుండి కూడా కమీషన్లు వసూలు చేస్తున్నారు. జిల్లాల వారీగా ఈ దోపిడీ జరుగుతోంది. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా?
రాష్ట్రంలో కొనసాగుతున్న అరచాకపాలనపై దృష్టి మళ్లించడానికే కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్ కుటుంబంపై దూషణలకు దిగుతుంది. 36 ప్రైవేట్ విద్యుత్ కంపెనీలతో చంద్రబాబు గతంలో ఒప్పందాలు చేసుకున్నారు. సగటున రూ.5.90ల పైన యూనిట్ కరెంటు కొనుగోలు చేశారు. అధిక ధరలతో విద్యుత్ కొనుగోలుతో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లింది.
ఈ అంశంపై సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలి. వైఎస్ జగన్ ప్రభుత్వం కేవలం రూ.2.49 లకే ఒప్పందం చేసుకుంది. అదికూడా కేంద్ర సంస్థ సెకీతోనే. అదానీ, అజూమ్ సంస్థలతో వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. జగన్ ప్రభుత్వ నిర్ణయాల వలన ఏటా రూ.3,700 కోట్ల ఆదా జరిగింది. చంద్రబాబు ఒప్పందాల వలన లక్షల కోట్ల భారం ప్రజల మీద పడింది
విదేశాల్లో వైఎస్ జగన్ పెట్టుబడులు పెట్టారంటూ 2014-19 మధ్య చంద్రబాబు ఆరోపణలు చేశారు. ప్యారడైజ్ పేపర్లు అంటూ హడావుడి చేశారు. తాను చేసిన ఆరోపణలపై ఆధారాలు బహిర్గతం చేయాలని చంద్రబాబుకు వైఎస్ జగన్ సవాల్ చేశారు. కానీ చంద్రబాబు సైలెంట్ అయ్యారు. 15ఏళ్లుగా వైఎస్ జగన్ కుటుంబంపై చంద్రబాబు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. వీటిని జనం పట్టించుకోరు. చంద్రబాబు సూపర్ సిక్స్ అమలు చేయకపోతే ప్రజల్లో తిరుగుబాటు ఖాయం’ అని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment