కూటమిలో కుంపట్లు
ప్రజా సమస్యలు గాలికొదిలేసి గ్రూపులు, కుట్రలు..కొట్లాటలు
ఎవరికి వారే చందాన మూడు పారీ్టల నేతలు
తిరుపతిలో రెచ్చిపోతున్న షాడో ఎమ్మెల్యేలు
సెటిల్‌మెంట్లు, దందాలతో బెంబేలెత్తుతున్న నగరవాసులు
నేడు డెప్యూటీ సీఎం వద్ద పంచాయితీకి సిద్ధం!
ఆధ్యాత్మికత నగరమైన తిరుపతిలో కూటమి నేతలు ప్రజా సమస్యలను గాలికొదిలేసి గ్రూపు రాజకీయాలకు శ్రీకారం చుడుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. కొందరు టీడీపీ నేతలు నువ్వా.. నేనా? అన్నట్టు సెటిల్‌మెంట్లకు దిగుతూ అడ్డంగా దోచుకుతింటున్నారు. తామేమీ తక్కువ కాదంటూ చిత్తూరు నుంచి వచ్చిన షాడో ఎమ్మెల్యేలు దందాలకు దిగుతూ స్థానికులకు చుక్కలు చూపిస్తున్నారు. కూటమిలో తమకు గుర్తింపులేదంటూ బీజేపీ నేతలు లోలోనే రగిలిపోతుండగా.. ఇంతకాలం జెండా మోసిన తమను పట్టించుకోలేదంటూ జనసేన నేతలు కొందరు కత్తులు నూరుతున్నారు. మంగళవారం తిరుపతికి విచ్చేయనున్న తమ పార్టీ అధినేత వద్దే తేల్చుకుంటామంటూ తెగేసి చెబుతున్నారు.
సాక్షి ప్రతినిధి తిరుపతి: కూటమి ప్రభుత్వం ఏర్పడి పట్టుమని వందరోజుల గడిచాయో లేదో తిరుపతి నియోజకవర్గంలో కుట్ర రాజకీయాలకు తెరలేపారు. తిరునగరి సమస్యలను పక్కన పెట్టి, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన నాయకులు తమదే పైచేయి కావాలంటూ ఎవరికి వారు కుట్ర రాజకీయలు చేస్తున్నారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు స్థానికుడు కాకపోవడం, ఆయనకు సొంత పార్టీ నుంచే అసమ్మతి సెగలు రేగడం, చిత్తూరు రాజకీయాలను నగరంపై రుద్దడమే ప్రధాన కారణం. ఎమ్మెల్యే దిష్టిబొమ్మతో సమానమంటూ బాహాటంగానే ఆయనపై నగర టీడీపీ, బీజేపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. కనీసం మాట వరసకైనా ఆయనను పలుకరించిన పాపాన పోలేదు. కూటమి నేతల విభేదాలు ఒక ఎతైతే.. మరో పక్క జనసేన పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. పేరుకే ఆయన ఎమ్మెల్యే..అంతా ఆయన బంధువర్గం, ప్రధాన అనుచరులదే నగరంలో హవా కొనసాగుతోంది.
షాడో ఎమ్మెల్యేల ఇష్టారాజ్యం
తిరుపతిలో ఎమ్మెల్యే అంటే సామాన్య ప్రజలకు తెలియదంటే ఆశ్యర్యపోవాల్సిందే. తన అనుచరవర్గంతో షాడో ఎమ్మెల్యేలను తయారు చేసి, నిత్యం దందాలు, సెటిల్‌మెంట్లు, బెదిరింపు రాజకీయాలు చేయిస్తున్నారు. ప్రధానంగా ఎమ్మెల్యే కుమారుడు మదన్, ఎమ్మెల్యే సోదరుని తనయుడు ఆరణి శివకుమార్, నగర జనసేన అధ్యక్షుడు రాజారెడ్డి, చిత్తూరుకు చెందిన రౌడీమూకలు బ్యాచ్‌లుగా ఏర్పడి తిరుపతి నగరాన్ని పంచుకుంటున్నారు. తాము ఫలానా ఏరియాను చూసుకుంటామంటూ ఎమ్మెల్యేకే నేరుగా హుకుం జారీ చేస్తున్నారు.
భూసెటిల్ మెంట్ పంచాయితీలు, అనధికార లేఅవుట్లు అంటూ రియల్టర్లను బెదిరించి వసూళ్లు, ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేసి రిజిస్ట్రేషన్ల కోసం రెవెన్యూ అధికారులను బెదిరించడం, కళాశాల సీట్లు తమకే ఇవ్వాలంటూ జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలను బెదిరించి ముడుపులు సేకరించడం చేస్తున్నారు. నగరపాలక సంస్థలో కొన్ని రోజులకు ముందు జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే స్థానంలో షాడో ఎమ్మెల్యేగా తన సోదరుని తనయుడు శివకుమార్ అధికార కుర్చీలో కూర్చొని అధికారులను ఆదేశించిన విషయం పచ్చ పత్రికలు సైతం కోడై కూసిన విషయం విదితమే.
నేడు పవన్‌కళ్యాణ్ వద్ద పంచాయితీ
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటన నేపథ్యంలో టీడీపీ, జనసేనకు చెందిన అసమ్మతి నేతలు ఆయన వద్ద ఎమ్మెల్యే తీరుపై ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. నగరంలో షాడో ఎమ్మెల్యేల అరాచకాలు, వసూళ్ల పర్వం, గ్రూపు రాజకీయాలు, ప్రభుత్వ అధికారులపై బెదిరింపులు, ఎమ్మెల్యే వ్యవహార శైలిపై ప్రత్యేకంగా పంచాయితీ పెట్టి అటో..ఇటో..తేల్చుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.
తారాస్థాయికి చేరిన కూటమి విభేదాలు
కూటమి నేతల సమన్వయలోపంతో ఒక్కసారిగా కుట్ర రాజకీయాలు భగ్గుమన్నాయి. ఆది నుంచి ఆరణి శ్రీనివాసుల అభ్యర్థత్వాన్ని వ్యతిరేకించిన స్థానిక టీడీపీ నేతలు ఆయనతో అంటీముట్టనట్టు వ్యహరిస్తున్నారు. మరికొందరు ఎమ్మెల్యే దిష్టిబొమ్మ అంటూ బహిరంగంగానే ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న సుగుణమ్మ గ్రూపు చాపకింద నీరులా రాజకీయం చేస్తుండగా, అదే పార్టీకి చెందిన జిల్లా పార్లమెంట్ ఇన్‌చార్జి నరసింహయాదవ్ గ్రూపు నామినేటెడ్ పదవుల పంపకం వరకు వేచి చూసే ధోరణిలో ఉంది. మరోపక్క కొత్తగా టీడీపీ నాయకుడు రవినాయుడు అనుచరులుగా మరో గ్రూపు తయారైంది. టీడీపీకి చెందిన మూడు గ్రూపులు సైతం ఎమ్మెల్యేపై విరుచుకుపడుతూ షాడో ఎమ్మెల్యే బెదిరింపు రాజకీయాలపై విమర్శలు గుప్పిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment