![Vijaya sai reddy appeals in Rajya Sabha for Farmers - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/30/VIJAYA-SAI-1.jpg.webp?itok=lWBdC3cb)
సాక్షి, న్యూఢిల్లీ: రోజురోజుకు పెరుగుతున్న ఎరువుల ధరలతో రైతులు అతలాకుతలమవుతున్నందున కేంద్ర ప్రభుత్వం ఎరువులపై సబ్సిడీ పెంచి రైతుల్ని ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం రాజ్యసభ జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ గత ఏడాదిగా ఎరువుల ధరలు గణనీయంగా పెరగడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఏడాదిలో వివిధ ఎరువుల ధరలు సగటున 45 నుంచి 60 శాతం పెరిగాయని, దీనివల్ల పెట్టుబడి వ్యయం పెరిగి రైతుల కష్టార్జితానికి గండి పడుతోందని పేర్కొన్నారు. ఇప్పటికే అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న రైతులకు పెరిగిన ఎరువుల ధరలు శరాఘాతంగా పరిణమించాయన్నారు.
ఈ నేపథ్యంలో రష్యా–ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధం కారణంగా దేశంలో ఎరువులకు మరింత కొరత ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని, భారత్ ఏటా దిగుమతి చేసుకునే ఎరువుల్లో 10 శాతం ఈ రెండు దేశాల నుంచే వస్తున్నాయని చెప్పారు. పెట్రోల్, గ్యాస్ ధరల పెంపు మాదిరిగానే ఎరువుల ధరలు కూడా మరింతగా పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయని, అదే జరిగితే రైతులు పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోతారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రభుత్వం ఎరువులపై సబ్సిడీని రూ.1.40 లక్షల కోట్ల నుంచి రూ.1.05 లక్షల కోట్లకు అంటే 30 శాతం తగ్గించిందని చెప్పారు. ఏడాదిగా ఎరువుల ధరలు క్రమేపీ పెరుగుతుంటే ప్రభుత్వం బడ్జెట్‌లో ఎరువులపై సబ్సిడీని గణనీయంగా తగ్గించడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇలాంటి రైతు వ్యతిరేక చర్యకు పాల్పడటం దురదృష్టకరమని చెప్పారు. ఇలాంటి సంక్షోభ సమయంలో రైతుల్ని ఆదుకోవాల్సిన తక్షణ కర్తవ్యం ప్రభుత్వంపై ఉన్నందున వెంటనే ఎరువులపై సబ్సిడీని పెంచాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment