పోలీసుల అమర వీరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తున్న జడ్జి , బెటాలియన్ కమాండెంట్
సిద్దవటం : దేశ సరిహద్దుల్లో విపరీతమైన చలి ఉన్నప్పటికీ దేశం కోసం, ప్రజల కోసం రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తూ తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అసువులు బాసిన పోలీసు అమర వీరుల సేవలు మరచి పోలేనివని బెటాలియన్ కమాండెంట్ శ్రీనివాసరావు, సిద్దవటం కోర్టు జడ్జి శ్రీనివాసకళ్యాణ్ పేర్కొన్నారు. సిద్దవటం మండలం భాకరాపేట గ్రామ సమీంలో ఉన్న ఏపీఎస్పీ 11వ బెటాలియన్‌లో శనివారం పోలీసు అమర వీరుల సంస్మరణ దినం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సిద్దవటం కోర్టు జడ్జి, బెటాలియన్ కమాండెంట్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చాలను ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు మరువలేనివని కొనియాడారు. కమాండెంట్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో కొన్ని సందర్భాల్లో పోలీసులు తమ ప్రాణాలను సైతం కోల్పోవాల్సి వస్తోందన్నారు. ఈ సందర్భంగా పోలీసు అమర వీరుల కుటుంబాలకు మెమెంటోలను జడ్జి శ్రీనివాసకళ్యాణ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ ఏఓ గులామ్ దస్తగిరి, అసిస్టెంట్ కమాండెంట్ జయప్రసాద్‌రావు, శ్రీనివాసరావు, డీఎస్పీ/ అసిస్టెంట్ కమాండెంట్ వెంకటరెడ్డి, ఆర్‌ఐలు అలీబాషా, కె.వి. రమణ, కె.వి. రంగారావు, సీఆర్‌కే రాజు, ఎం. ఆంజనేయులు, ఆర్‌ఎస్‌ఐలు, ఏఆర్ ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది, అమరులైన పోలీసుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment