●ఆర్‌బీసీదీ ఇదే కథ
బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లా దక్షిణ ప్రాంత కరువు రైతులకు శాశ్వత సాగు, తాగునీటిని అందించి ఈ ప్రాంతాన్ని సుభిక్షం చేసి రైతుల తల రాతను మార్చేందుకు గత ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి హంద్రీ–నీవా రెండోదశ అంతర్భాగంగా కొత్త పథకాలను చేపట్టారు. వాటికి నిధులు కూడా ఇచ్చారు. ఈ పనులన్నీ గాడిలో పడుతున్న సమయంలో అధికారం మారి టీడీపీ కూటమి ప్రభుత్వం రాకతో రైతుల తలరాత మళ్లీ మొదటికి వచ్చినట్టయ్యింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రాజెక్టులోని పథకాలను పూర్తిగా పక్కన పెట్టేసింది. వాటి జోలికి వెళ్లవద్దని, ఆ పనుల సంగతి మరచిపోండని తెగేసి చెప్పేసింది. దీంతో అధికార యంత్రాంగం ప్రాజెక్టు మొత్తానికి పుంగనూరు ఉపకాలువ లైనింగ్ పనిపైనే దృష్టి పెట్టి పనిచేస్తోంది. మంజూరైన ఉప కాలువలు, రిజర్వాయర్, డిస్ట్రిబ్యూటరీ పనులన్నింటికీ సర్వేలు పూర్తయ్యాయి. నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. ఇప్పుడు ఈ పథకాలు ప్రశ్నార్థకంగా మారాయి.
రూ.359 కోట్లతో రిజర్వాయర్
పీలేరు నియోజకవర్గం గుర్రంకొండ మండలం చెర్లోపల్లె ఎగువతోటపల్లె వద్ద ఒక టీఎంసీ నీటి సామర్థ్యంతో రెడ్డెమ్మకోన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అప్పట్లో సిద్ధమైంది. పనులకు సంబంధించి స్టేజ్–1 పనులైన సమగ్ర సర్వే, ప్రాజెక్టు నివేదిక పనులు ఎప్పుడో పూర్తయ్యాయి. హంద్రీ – నీవా నుంచి కృష్ణా జలాలను రిజర్వాయర్‌కు మళ్లించేలా రూపకల్పన జరిగింది. ఎగువతోటపల్లె వద్ద నిర్మించే రిజర్వాయర్‌కు చింతపర్తి డిస్ట్రిబ్యూటరీ నుంచి కృష్ణా జలాలను తరలిస్తారు. ఈ నిర్మాణం పూర్తయ్యాక దీనికింద 5 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, వాయల్పాడు, గుర్రంకొండ మండలాల్లోని 15 గ్రామాలకు తాగునీటిని అందించే ప్రణాళిక చేశారు. దీనితోపాటే హరిహరాదుల చెరువుకు 35 ఎంసీఎఫ్‌టీ, రామానాయిని చెరువుకు 35 ఎంసీఎఫ్‌టీల నీటిని మళ్లించాలని కూడా ప్రణాళికలో పెట్టారు. స్టేజ్–1 పనులు పూర్తికావడంతో రూ.359 కోట్లతో పని చేపట్టేందుకు పాలనాపరమైన అనుమతి వచ్చే సమయంలో ప్రభుత్వం మారడంతో రిజర్వాయర్‌పై ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
రొంపిచర్ల డిస్ట్రిబ్యూటరీ
పీలేరు నియోజకవర్గం కేవిపల్లె మండలంలోని అడవిపల్లె రిజర్వాయర్ నుంచి నీవా ఉపకాలువ ప్రారంభం అవుతుంది. ఇది చిత్తూరుజిల్లాలోని పులిచెర్ల మండలం కమ్మపల్లె మీదుగా సాగుతుంది. కమ్మపల్లె వద్ద 54.350 కిలోమీటర్ నుంచి రొంపిచర్ల డిస్ట్రిబ్యూటరీ పనులు ప్రారంభించి 20కిలోమీటర్ల మేర మట్టికాలువను తవ్వుతారు. కాలువ ద్వారా రైతులకు సాగునీరు అందించడంతోపాటు రొంపిచర్ల, చిన్నగొట్టిగల్లు, పులిచర్ల మండలాల్లోని 25వేల మంది జనాభాకు తాగునీరు అందించాలని ప్రణాళిక చేశారు. రొంపిచర్ల డిస్ట్రిబ్యూటరీకి అడవిపల్లె రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలను నీవా కాలువ నుంచి మళ్లించి తరలిస్తారు. ఈ పనులు చేపట్టేందుకు వీలుగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సమగ్ర సర్వే, ప్రాజెక్టు నివేదిక కోసం రూ.59.22 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో సర్వే పూర్తిచేయగా 24 చెరువులకు కృష్ణా జలాలు తరలించి, దానికింద 2,580 ఎకరాల ఆయకట్టు సాగులోకి తేచ్చేలా ప్రతిపాదించారు. దీనికి రూ.73.43 కోట్లతో పనులు చేపట్టేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ పథకంపై రైతాంగం ఆశలు పెట్టుకుంది.
బాహుదాకు కృష్ణా జలాలు ఇస్తారో లేదో..?
మదనపల్లె నియోజకవర్గంలోని నిమ్మనపల్లె మండలంలోని బాహుదా రిజర్వాయర్‌కు కృష్ణా జలాలను తరలించేలా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. పుంగనూరు ఉపకాలువ విస్తరణ పనుల్లో భాగంగా ఈ నీటిని తరలించే పనులను కలిపారు. పుంగనూరు ఉపకాలువ కిలోమీటర్ 173.00 నుంచి పిల్లకాలువను తవ్వి బాహుదా ప్రాజెక్టులోకి కృష్ణా జలాలను తరలిస్తారు. దీనితోపాటుగా వాయల్పాడు మండలంలో పాలమంద డిస్ట్రిబ్యూటరీ నిర్మాణం కోసం ప్రతిపాదించారు. వాయల్పాడు ఉపకాలువ కిలోమీటర్ 23.500 వద్ద నుంచి పిల్లకాలువ తవ్వి 2,100 ఎకరాలకు సాగునీటిని అందించేలా గత ప్రభుత్వానికి ప్రతిపాదించారు. అయితే ప్రస్తుతం ఈ పథకాల స్థితి అచేతనావస్థలో ఉన్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టదలచినవి అన్న కారణంగా నిలిపివేస్తారా.. ముందుకు తీసుకెళ్తారా అన్నది వేచి చూడాలి.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రొంపిచర్ల డ్రిస్టిబ్యూటరీ, రామసముద్రం ఉపకాలువ పనులకు రూ.1.63 కోట్లతో సర్వే పూర్తి
రూ.359 కోట్లతో రెడ్డెమ్మకోన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్
పాలమంద డిస్ట్రిబ్యూటరీకి, బాహుదాకు కృష్ణా జలాలు
ఈ పథకాలను పక్కన పెట్టిన టీడీపీ ప్రభుత్వం
మదనపల్లె నియోజకవర్గం నుంచి పుంగనూరు ఉప కాలువ సాగే సుగాలిమిట్ట వద్ద 183.3 కిలోమీటర్ వద్ద నుంచి రామసముద్రం ఉపకాలువ (ఆర్‌బీసీ) పనులు మొదలుపెట్టి..ఇక్కడి నుంచి 750 మీటర్ల దూరంలో నీటిని ఎత్తిపోసేందుకు ఒక ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి రామసముద్రం దాక 28 కిలోమీటర్ల ఉపకాలువను తవ్వించి కృష్ణా జలాలు అందించాలని నిర్ణయించారు. ఇది పూర్తయితే ఆర్‌బీసీ కింద 60 చెరువులకు సాగునీరు, 84వేల మంది జనాభాకు తాగునీటిని సరఫరా చేయాలని లక్ష్యంగా చేసుకున్నారు. ఇందులో భాగంగానే రామసముద్రం వద్ద ఒక రిజర్వాయర్‌ను నిర్మించి తాగునీటి అవసరాలు తీర్చేలా గ్రామాలకు సరఫరా చేయాలన్నది ప్రణాళిక. ఈ పనులు చేపట్టడం కోసం కాలువ సర్వే, సమగ్ర నివేదిక సమర్పించేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.1.03కోట్లను మంజూరు చేయగా టెండర్ నిర్వహించి సర్వే సంస్థకు అప్పగించగా సమగ్ర సర్వే పూర్తయి నివేదిక ప్రభుత్వానికి చేరింది. రామసముద్రానికి ప్రయోజనం చేకూర్చే ఈ పథకంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment