ఒంటిమిట్ట రామయ్య హుండీ ఆదాయం లెక్కింపు
ఒంటిమిట్ట: ఆంధ్రా భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయం హుండీ ఆదాయం మంగళవారం టీటీడీ అధికారులు లెక్కించారు. లెక్కింపు మొత్తం పూర్తయ్యేసరికి స్వామివారి హుండీ ఆదాయం 7 లక్షల, 7 వేల, 990 రూపాయలు వచ్చినట్లు ఆలయ టీటీడీ అధికారులు వెల్లడించారు.
18 నుంచి
డిపార్టుమెంట్ పరీక్షలు
రాయచోటి: ఈనెల 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్న డిపార్టుమెంట్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ పరీక్షలకు అన్నమయ్య జిల్లా డీఆర్‌ఓ కె.మధుసూదన్ రావు పర్యవేక్షణ అధికారిగా కొనసాగనున్నారు. జిల్లాలోని అంగళ్లు సమీపంలోని విశ్వం ఇంజినీరింగ్ కళాశాలలో మూడు రోజులపాటు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. జిల్లాలోని అన్ని డిపార్టుమెంట్లకు సంబంధించిన 1800 మంది ప్రభుత్వ ఉద్యోగులు పరీక్షలకు హాజరు కానున్నారు.
పదో తరగతి విద్యార్థుల
వివరాల సవరణకు అవకాశం
రాయచోటి: పదో తరగతి చదువుతున్న విద్యార్థుల పేర్లు, పుట్టిన తేదీ తదితర వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే వాటిని సరిచేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రమణ్యం సూచించారు. మంగళవారం రాయచోటిలో పత్రికలకు ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. 2025 మార్చిలో జరిగే పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే 10వ తరగతి విద్యార్థులకు సంబంధించి గతంలో ఆన్‌లైన్‌లో వివరాలు తప్పుగా నమోదు చేసినట్లయితే పాఠశాల రికార్డులను అనుసరించి మార్పు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు ఈ అవకాశం ఉందన్నారు.
రిపబ్లిక్ డే వేడుకలకు
గద్దల పవన్
రాజంపేట రూరల్: దేశ రాజధాని దిల్లీలో జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు తమ కళాశాలకు చెందిన డిగ్రీ చివరి సంవత్సరం బీకామ్ విద్యార్థి గద్దల పవన్ ఎంపికయ్యాడని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి.పురుషోత్తమ్ తెలిపారు. సికింద్రాబాద్‌లోని ఎన్‌సీసీ ట్రైనింగ్ క్యాంప్‌లో ప్రస్తుతం పవన్ ఉన్నట్లు తెలిపారు. జనవరి 26వ తేదీ నిర్వహించే గణతంత్ర వేడుకల్లో పాల్గొంటాడన్నారు.
యాదవ ఎంప్లాయిస్
సొసైటీలో స్థానం
రాయచోటి (జగదాంబసెంటర్): యాదవ్ ఎంప్లాయిస్ సొసైటీ (వైఈఎస్) రాష్ట్ర కార్యవర్గంలో అన్నమయ్య జిల్లా వాసులకు స్థానం లభించింది. గుంటూరులో ఆదివారం నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో వైఈఎస్ రాష్ట్ర అదనపు కార్యదర్శిగా కుమార్‌యాదవ్(మదనపల్లి), ఉపాధ్యక్షుడిగా పుల్లయ్యయాదవ్(రాజంపేట), సంయుక్త కార్యదర్శిగా సంక రవికుమార్‌యాదవ్(రాయచోటి)లను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. సంఘం అన్నమయ్య జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగేంద్రబాబు, వెంకటయ్య, ట్రెజరర్ దూల్లవారిపల్లె శ్రీనివాస్‌యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ రఘుయాదవ్ తదితరులు వీరికి శుభాకాంక్షలు తెలిపారు.
కరుణామయుడు ఏసుప్రభువు
రాజంపేట: కరుణామయుడు, దయామయుడుగా ఏసుప్రభువు ఆరాధనలు అందుకుంటున్నాడని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, రాజంపేట శాసనసభ్యుడు ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని జానీబాషాపురం డీసీఎంఎస్ మాజీ ౖచైర్మన్ దండు గోపి స్వగృహంలో మంగళవారం రాత్రి సపోస్ క్రిస్మస్ వేడుకలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీస్తు వాక్యాలు మనిషిని మంచిమార్గంలో నడిపించేందుకు దోహదపడతాయన్నారు. క్రైస్తవులకు ముందస్తుగా క్రిస్మిస్ శుభాకాంక్షలను తెలిపారు. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని క్రైస్తవులంతా ఆశీర్వదించాలన్నారు. అనంతరం కేక్‌ను కట్ చేశారు. కాకతీయ విద్యాసంస్థల అధినేత పోలా రమణారెడ్డి, ఎస్‌బీఐ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నేత దండుమణి, వైఎస్సార్‌సీపీ నేతలు పాపినేని విశ్వనాథరెడ్డి, జీవీ సుబ్బరాజు, నవీన్, మౌలా, జాకీర్, కళ్యాణరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment