స్థలాలను ఆక్రమించేందుకు గుట్టను తవ్వి చదును చేస్తున్న జేసీబీ
రూ.40 కోట్లు విలువచేసే ప్రభుత్వ స్థలాలు దురాక్రమణ
200 ప్లాట్లకు పైగా అనధికార విక్రయాలు
విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు
గుట్టలు చదును చేస్తున్నా పట్టించుకోని అధికారులు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందే తడవు అక్రమార్కుల భూ దాహానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జా చేసేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. మదనపల్లె పట్టణ శివారు ప్రాంతంలో కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాలపై కన్నేసి అందినకాడికి దండుకుంటున్నారు.
యథేచ్ఛగా కబ్జాల పర్వం కొనసాగుతున్నా నియంత్రించాల్సిన రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. అధికారుల అండదండలతోనే అక్రమార్కులు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మదనపల్లె: పట్టణానికి ఆనుకుని ఉన్న బీకే.పల్లె పంచాయతీలో కబ్జాల పర్వం జోరుగా కొనసాగుతోంది. కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాలను అక్రమార్కులు ఆక్రమించుకుని, అనధికార విక్రయాలు చేసేస్తున్నారు. ప్రభుత్వ స్థలాల్లో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు మామూళ్లకు అలవాటుపడి చూసీచూడనట్లు వదిలేస్తున్నారు.
మంగళవారం బీకే.పల్లె పంచాయతీలో రెవెన్యూ అధికారుల సమక్షంలో రెవెన్యూ సదస్సు జరుగుతుంటే, మరోవైపు భూ బకాసురులు సచివాలయానికి ఆనుకుని గుట్టలను యథేచ్ఛగా జేసీబీలతో చదునుచేస్తూ ఆక్రమణలకు పాల్పడ్డారు. దీనిపై స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో, ఆక్రమణలకు అధికారులే అండదండలు అందిస్తున్నట్లు స్థానికులు వాపోయారు.
● బీకే.పల్లె పంచాయతీ అనంతపురం–కృష్ణగిరి జాతీయ రహదారికి ఆనుకుని గుట్ట ప్రాంతాల్లో ఉండటం అక్రమార్కులకు బాగా కలిసివచ్చింది. 2005–06లో సర్వే నంబర్.548, 440 పార్ట్‌లో 291 ప్లాట్లను ఇందిరమ్మ కాలనీకి కేటాయిస్తూ ప్రభుత్వ ఆధ్వర్యంలో లేఅవుట్ వేశారు. ఈ సర్వే నంబర్లకు ఆనుకుని పది ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు ఉన్నాయి.
అప్పట్లో ఊరికి ఈ స్థలం కొంత దూరంగా ఉండటంతో చాలామంది పట్టాలు తీసుకున్నప్పటికీ ఇళ్లు నిర్మించుకోలేదు. కొందరు పునాదులు వేసుకుని ఆపేస్తే, మరికొందరు అలాగే వదిలేశారు. పట్టణ జనాభా రోజురోజుకీ విస్తరిస్తుండటం, భూముల విలువలు అమాంతం ఆకాశానికి చేరడంతో మధ్యతరగతి ప్రజల దృష్టి శివారు ప్రాంతాల భూములపై పడింది. దీన్ని ఆసరాగా చేసుకున్న దళారులు బీకే.పల్లె పంచాయతీలో ఖాళీగా ఉన్న స్థలాలను గుర్తించి, వాటికి దొంగ పట్టాలు సృష్టించి తమ ఆధీనంలో ఉన్నాయని అమాయకులను నమ్మించడం మొదలుపెట్టారు.
నీరుగట్టువారిపల్లెలో చేనేత పరిశ్రమ అభివృద్ధి చెందడంతో అనంతపురం, తంబళ్లపల్లె, పీలేరు నియోజకవర్గాల నుంచి పలువురు బతుకుతెరువు కోసం మదనపల్లెకు వచ్చి, ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకునేందుకు ఆసక్తి చూపారు. బీకే.పల్లెలో గుంట స్థలం ఉన్న ప్లాట్లు రూ.4 నుంచి 6 లక్షలకు దళారులు విక్రయించారు. ఖాళీ స్థలాలన్నీ అమ్ముడైపోవడంతో దళారుల కన్ను గుట్టలపై పడింది. రెవెన్యూ అధికారుల సహకారంతో గుట్టలను చదును చేస్తూ, ఏర్పడిన ఖాళీ స్థలాలకు అధికారుల ముందరే బేరం కుదుర్చుకుని, ఇళ్లు నిర్మించి, కరెంటు కనెక్షన్ వచ్చేంతవరకు తమదే బాధ్యత అన్నట్లుగా అన్నీ చూసుకుంటున్నారు.
దీంతో అక్రమ నిర్మాణాలు జోరందుకున్నాయి. బీకే.పల్లె పంచాయతీలో ప్రభుత్వ స్థలాల కబ్జాపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే నవాజ్‌బాషా ఉక్కుపాదం మోపి అన్నింటినీ తీసివేయించారు. అనర్హులను ఏరిపారేశారు. దీంతో దళారులు తోకముడిచారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తిరిగి దళారులు విజృంభించడం మొదలుపెట్టారు. కోట్లు విలువైన ప్రభుత్వస్థలాలు కబ్జాలకు పాల్పడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment