యువకుడిని రాళ్లతో కొట్టి హతమార్చారు
పుంగనూరు : అన్నమయ్య జిల్లా, మదనపల్లె మండలం మమ్మిడిగుండ్లపల్లెకి చెందిన గంగులరెడ్డి కుమారుడు సోమశేఖర్‌రెడ్డి (36)ని చిత్తూరు జిల్లా పరిధిలో రాళ్లతో కొట్టి చంపేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. శనివారం పుంగనూరు సీఐ శ్రీనివాసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. సోమశేఖర్‌రెడ్డిని 20 రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం బోయకొండ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకొచ్చారు. రాళ్లతో కొట్టి చంపేసి వెళ్లిపోయారు. శుక్రవారం రాత్రి దీనిని గమనించిన ఆ ప్రాంత వాసులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి, కేసు నమోదు చేశారు. హతుడి వద్ద దొరికిన సమాచారాన్ని బట్టి మదనపల్లె మండలం మమ్మిడిగుండ్లపల్లెకి చెందిన సోమశేఖర్‌రెడ్డిగా నిర్ధారించారు. శవం పూర్తిగా గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. ఎముకలు బయటపడ్డాయి. శవానికి అటవీప్రాంతంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మధుసూదనాచారి ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ హత్య కేసులో పలురకాల అనుమానాలు ఉన్నాయని, హతుడి తండ్రిపై కూడా ఆరోపణలు ఉన్నాయని సీఐ తెలిపారు. దర్యాప్తులో వాస్తవాలు తేలాల్సి ఉందన్నారు. త్వరలోనే హంతకులను పట్టుకుంటామని స్పష్టం చేశారు. కాగా హతుడి భార్య, బిడ్డలు మృతి చెందిన కేసులో మదనపల్లె పోలీసులు ఇతనిపై కేసు నమోదు చేసి ఉన్నారని తెలిపారు. ఇలాంటి ప్రవర్తన కలిగిన సోమశేఖర్‌రెడ్డి నడవడిక నచ్చని తండ్రి గంగులరెడ్డి ఈ హత్య చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయని తెలిపారు.
20 రోజుల తరువాత వెలుగులోకి
కన్నతండ్రిపై అనుమానాలు
సీఐ శ్రీనివాసులు వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment