భూముల మార్కెట్ విలువ పెంపును నిలుపుదల చేయండి
రాయచోటి అర్బన్ : మున్సిపల్ పరిధిలో ప్రభుత్వం పెంచ తలపెట్టిన భూముల విలువను వెంటనే నిలుపుదల చేయాలని పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్‌కు విన్నవించారు. శనివారం సాయంత్రం వారు జేసీని ఆయన ఛాంబర్‌లో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 2022లో ప్రభుత్వం రాయచోటి ప్రాంతాన్ని అన్నమయ్య జిల్లాగా మార్చిందన్నారు ఫలితంగా రాయచోటి, మాసాపేట, కస్పా గొల్లపల్లె రెవెన్యూ గ్రామాలలోని భూముల మార్కెట్ విలువను 100 నుంచి 300 శాతం పెంచారన్నారు. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం దారుణంగా పడిపోయిందన్నారు. కాగా ప్రభుత్వం ప్రస్తుతం తిరిగి భూముల మార్కెట్ విలువను పెంచబోతున్నట్లు తెలుస్తోందన్నారు. భూముల విలువ పెంచితే రియల్ ఎస్టేట్ వ్యాపారం మరింతగా దిగజారుతుందన్నారు. ఇప్పటికే వ్యాపారంలో పెట్టుబడుల కోసం అధికమొత్తంలో అప్పులు చేశామన్నారు. అప్పులకు వడ్డీలు కూడా చెల్లించలేకున్నామన్నారు. అధికారులు ఈ విషయాలను పరిశీలించి భూముల మార్కెట్ విలువ పెంపుదలను నిలుపుదల చేయాలని వారు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment