ఆనవాళ్లనైనా రక్షిస్తారా..?
బి.కొత్తకోట: పాళేగాళ్ల పాలనకు, విజయనగర రాజ్య పాలనా కాలానికి గుర్తుగా చారిత్రిక చిహ్నంగా నిలిచిన గొప్ప ఆలయాలు గుప్త నిధుల ముఠాల దెబ్బకు కాలగర్భంలో కలసిపోతున్నాయి. గత వైభవానికి, గత చరిత్రను తెలిపే సాక్ష్యంగా నిలిచిన సాంస్కృతిక వారసత్వంగా ఉన్న బి.కొత్తకోట మండలం గట్టుకు దక్షిణాన సమీప కొండపై నిర్మించిన చారిత్రక రంగనాథస్వామి ఆలయాన్ని గుప్త నిధుల ముఠాలు ఽపూర్తిగా ధ్వంసం చేసేశారు. అద్భుతమై శిల్పకళతో నిర్మించిన ఆలయం ఉనికి కోల్పోయింది. రంగనాథస్వామి ఆలయాన్ని కూల్చేయగా ప్రస్తుతం శిథిలాల కుప్పగా కనిపిస్తోంది. 2022 డిసెంబర్ ఏడున సాక్షిలో ‘చెదురుతున్న చరిత్ర’ శీర్షిక ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఆనాటికి ఆలయం, గోపురం, గర్భగుడి ఉండేవి. వాటి పునరుద్ధరణకు వీలయ్యేది. ఇప్పుడు పునరుద్ధరణ పనులు చేపట్టలేని విధంగా ఆలయంలో విధ్వంసం సృష్టించారు. గుప్త నిధుల ముఠాల దెబ్బకు చరిత్రకు సాక్ష్యంగా భావి తరాలకు అందాల్సిన చరిత్ర కనుమరుగైంది.
పాళ్యానిది విశిష్ట చరిత్ర
క్రీస్తుశకం 1336–1646 మధ్యకాలంలో విజయనగర రాజుల పాలనలో తంబళ్లపల్లె నియోజకవర్గంలో పాళేగాళ్ల ప్రభావం ఉండేది. పాళేగాళ్లలో ములకలచెరువు మండలం సోంపాళ్యం పాళేగాళ్లు బలమైన వాళ్లుగా చరిత్రలో చెబుతారు. అప్పట్లో గట్టు గ్రామం ఏర్పాటు కాని రోజుల్లో బి.కొత్తకోట మండలం ప్రస్తుత గట్టుకు సమీప దక్షిణాన గట్టు కొండ వెనుకవైపున కొండపై దట్టమైన అటవీప్రాంతం ఉండేది. సొంపాళ్యం చెందిన పాళేగాళ్ల సోదరులు వెంకటపతినాయుడు, దొరప్పనాయుడు ఈ ప్రాంతాన్ని పాలించారు. సొదరులు తమ రాజ్యాన్ని విభజించుకోవడంతో దొరప్పనాయుడు బి.కొత్తకోట మండలం గట్టు కొండపై అటవీప్రాంతంలో కొత్తగా పాళ్యం (గ్రామం) నిర్మించి దానికి అతనే పాలకునిగా ప్రకటించుకున్నాడు. ఈ విషయం తెలుసుకొన్న విజయనగర పాలకులు కప్పం కట్టాలని కుబురు పంపగా ధిక్కరించిన దొరప్పనాయుడు పాలన సాగించగా తర్వాత విజయనగర పాలనలోని వచ్చింది. ఇప్పటిలా అప్పట్లో ఇప్పటి గట్టు, దాని పరిసర గ్రామాల నిర్మాణం జరగలేదు. కొండపై అడవి ప్రాంతంలో పాళ్యం ఒక్కటే ఉండేది. పాళ్యం ప్రజలు సేద్యం, అడవిలో పండ్లు, పాడిపై ఆధారపడి జీవించారు. సేద్యం కోసం పాళ్యంకు ఇరువైపులా రంగప్ప చెరువు, పెద్దనాయుడు చెరువులను నిర్మించారు. ప్రజల భక్తివిశ్వాసాలకు అనుగుణంగా కొండకు ఎదురుగా పడమట వాకిలితో రంగనాథస్వామి ఆలయం, తూర్పు దిశగా శివాలయం నిర్మించారు. రెండు ఆలయాలకు వెనుకవైపుల్లో రెండు చెరువులు ఉండటం విశేషం. పాళ్యం చుట్టూ కోట గోడలు, ఎదురుగా ఉన్న గట్టు కొండపై కోట, ఆలయం, పీర్లచావిడి నిర్మించారు. ఇప్పుడు పాళ్యం కనుమరుగైనా చరిత్ర చెప్పే ఆధారాలు, కోట గోడలు, పూర్వకాల చరిత్ర ఆనావళ్లు తెలిపే శిల్పకళ, ఆలయాలపై శిలా శాసనాలు, నాటి పాలకుల గురించి తెలిపే శిల్పకళ ద్వారా నిక్షిప్తం చేశారు. అప్పట్లో మతసామరస్యం ఫరిడవిల్లిందని చెప్పేందుకు ఆలయాల గర్భగుడుల్లోని బండరాళ్లపై పీర్లను చెక్కారు. కాలగమనంలో పాళ్యం కనుమరుగయ్యే స్థితిలో పాళ్యం కిందకు వచ్చి గట్టు గ్రామంగా ఏర్పడింది.
శివలింగం ముక్కలు
రంగనాథస్వామి ఆలయానికి కుడివైపు రాతిబండపై శివాలయం నిర్మించారు. ఇటివల గుప్త నిధుల కోసం ఆలయంలోని శివలింగం పగులగొట్టి ముక్కలు చేశారు. ఇందులో సగంగా ఉన్న రెండు ముక్కల శివలింగం గర్భగుడిలో ఉంచారు. గర్భగుడిలో నిర్మాణాలను ధ్వంసం చేశారు. ఆలయం ఎదుట ప్రతిష్టించిన నంది విగ్రహం ఎత్తుకెళ్లిపోయారు. విగ్రహాలు పగులగొట్టిన అనవాళ్లు కనిపిస్తున్నాయి. ఈ బండరాళ్లతో ఆలయాన్ని నిర్మించగా వీటిని పడగొట్టారు. రాతి గోడల్లో నిధులు ఉంటాయని ధ్వంసం చేశారు. ఆలయంలోపలా, వెలుపల గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయి.
ప్రస్తుత ఆలయం, కనిపించని గర్భగుడి గోపురం (ఇన్‌సెట్) 2022లో రంగనాథస్వామి ఆలయం (ఫైల్)
రంగనాథస్వామి ఆలయం పురావస్తుశాఖ పరిధిలో ఉంది. ఈ ఆలయాన్ని సంరక్షించడంలో యంత్రాంగం విఫలమైంది. ప్రస్తు తం ధ్వంసమైన ఆలయానికి చెందిన ఆనవాళ్లయిన బండలు, రాతి కూసాలు, లోపలి స్తంభాలను పరిరక్షించి ఆలయ మంటపాన్ని పునరుద్ధరిస్తే భవిష్యత్ తరాలకు ఇక్కడి చరిత్రను అందించినట్టవుతుంది. ఆలయ పరిసరాల్లోనే ప్రజలు నివసించిన ఇళ్ల నిర్మాణాల కట్టడాలు, కోట గోడ కట్టడం, బురుజులు, గ్రామంలోకి ప్రవేశించే సింహద్వార ముఖం ఇంకా సజీవంగానే కనిపిస్తున్నాయి. ఈ ఆనవాళ్లు కూడా చరిత్రలో కలిసిపోకుండా చర్యలు తీసుకోవాల్సివుంది. ఈ పరిస్థితిపై పురావస్తుశాఖ అధికారి శివకుమార్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా ఆమోదం లభించలేదన్నారు. ఆలయాన్ని త్వరలో సందర్శించి ఆనవాళ్ల రక్షణకు చర్యలు తీసుకుంటామని, దీనికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment