వరదాయిని.. జగజ్జనని
బ్రహ్మంగారిమఠం : ‘వర ప్రదాయిని.. జగజ్జనని’ అంటూ భక్తులు శరణు వేడారు. ‘కొలిచే వారి కొంగు బంగారమై నిలిచే తల్లీ.. మమ్మల్ని చల్లంగా చూడు’ అంటూ భక్తి శ్రద్ధలతో ప్రార్థించారు. ఈశ్వరీదేవి మఠం జగన్మాత నామస్మరణతో మార్మోగింది. బ్రహ్మంగారిమఠంలోని శ్రీఈశ్వరీదేవి మఠంలో అమ్మవారి ఆరాధన గురుపూజ మహోత్సవాలు కనుల పండువగా నిర్వహిస్తున్నారు. ఐదో రోజైన గురువారం పూర్వపు మఠాధిపతి వీరబ్రహ్మయ్యాచార్య సాముల వారి ఆరాధన నిర్వహించారు. ఉదయం ప్రభాత సేవ, అభిషేకం, బిల్వదళార్చన, గురుపూజ విధులు చేపట్టారు. మఠాధిపతి శ్రీవీరశివకుమారస్వామి, రాజేశ్వరిదేవి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం ద్వార పూజ, నైవేద్యం, మంత్ర పుష్పం, నీరాజనం, తీర్థప్రసాద వినియోగం తదితర కార్యక్రమాలు చేపట్టారు. రాత్రి గ్రామోత్సవం ఉత్సాహ భరితంగా జరిగింది. బ్రహ్మంగారిమఠానికి చెందిన శ్రీచిన్మయామిషన్ వారి గీతాపారాయణం భక్తులను అలరించింది. కళాకారులు చేపట్టిన భజన కార్యక్రమం ఆకట్టుకుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ బీవీ జగన్‌మోహన్‌రెడ్డి, సీవీ సుబ్బారెడ్డి, బి.నారాయణస్వామి, సి.రామిరెడ్డి, ఎమ్.పద్మజ తదితరులు పాల్గొన్నారు.
భక్తులతో కళకళ
బ్రహ్మంగారిమఠంలోని ప్రముఖ దర్శనీయ స్థలాలు భక్తులతో కళకళలాడుతున్నాయి. అమ్మవారి ఆరాధనోత్సవాలకు వచ్చిన వారు పరిసర ప్రాంతాల్లోని ఆలయాలను దర్శించుకుంటున్నారు. శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి మఠం, స్వామి నివాస గహం, పోలేరమ్మ చేత నిప్పు తెప్పించిన రచ్చబండ, పోలేరమ్మ గుడి, కక్కయ్య మఠం, బ్రహ్మంసాగర్ ప్రాజెక్టు, ఈశ్వరీదేవి తపస్సు చేసిన గుహ, సిద్ధయ్య మఠం, అక్కంపేటలోని నాగలింగేశ్వరస్వామి ఆలయం(విభూది లింగం), మద్దాయత్రి విశ్వకర్మ వంశవృక్ష దేవాలయం, రామాలయం (భజన మందిరం) తదితర ప్రాంతాలను సందర్శించారు.
కనుల పండువగా
అమ్మవారి ఆరాధనోత్సవాలు
మార్మోగిన ఈశ్వరీదేవి నామస్మరణ
Comments
Please login to add a commentAdd a comment