వైవీయూ: కళాశాల విద్య (డిగ్రీ) కడప ప్రాంతీయ సంయుక్త సంచాలకులుగా డాక్టర్ డి. నాగలింగా రెడ్డి నియమితులయ్యారు. ఆర్‌జేడీగా పనిచేసిన డాక్టర్ డేవిడ్‌కుమార్‌స్వామి డిసెంబర్ 31న ఉద్యోగ విరమణ చేయడంతో ఆయన స్థానంలో నాగలింగారెడ్డిని నియమిస్తూ కళాశాల విద్య డైరెక్టర్ నారాయణ భరత్‌గుప్తా ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ఆయన బుధవారం కడప నగరంలోని ఆర్‌జేడీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. కాగా ఈయన అనంతపురం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉండగా, పూర్తిస్థాయి అదనపు బాధ్యతలతో కడప ఆర్‌జేడీగా బాధ్యతలు నిర్వహించనున్నారు.
ఎస్సీ కులగణనపై 7వరకు అభ్యంతరాల స్వీకరణ
రాయచోటి (జగదాంబసెంటర్): ఎస్సీ కులగణనపై నిర్వహిస్తున్న అభ్యంతరాల(ఆడిట్ ప్రక్రియ) స్వీకరణ గడువును ఈ నెల 7వ తేదీ వరకు ప్రభుత్వం పొడిగించిందని అన్నమయ్య జిల్లా ఎస్సీ సంక్షేమ, సాధికారక అధికారి ఎన్.జయప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 31వ తేదీతో గడువు ముగియనుండటంతో మరొక వారం రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసిందన్నారు. ఈ మేరకు జనవరి 7వ తేదీ వరకు కులగణనపై నిర్దేశిత ప్రాంతాల్లో సంబంధిత అధికారులు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారన్నారు. అలాగే ఎస్సీల ఉప – వర్గీకరణపై సూచించే నిర్దిష్ట సిఫార్సుల కోసం నియమించిన వన్‌మ్యాన్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఈ నెల 3వ తేదీన వైఎస్‌ఆర్ జిల్లా కడపలో పర్యటించనున్నట్లు తెలిపారు. 3న ఉదయం 11 గంటలకు కడపలో పర్యటించే వన్‌మ్యాన్ కమిషన్ కార్యక్రమానికి హాజరై సమాచారాన్ని తెలియజేయాలని కోరారు.
రెండు గ్రామాలకు
అందని పింఛన్
సంబేపల్లె: ప్రతి నెల ఒకటో తేదీన అందాల్సిన పింఛన్ రెండు గ్రామాలలోని లబ్ధిదారులకు అందక పోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. మండల పరిధిలోని రౌతుకుంట, సంబేపల్లె గ్రామాలకు సంబంధించి దాదాపు 500 మంది పింఛన్ దారులు కొత్త సంవత్సరం మొదట్లోనే పింఛన్ అందకపోవడంతో నిరాశ చెందుతున్నారు. బుధవారం ఉదయాన్నే పింఛన్ వస్తుందని ఎదురు చూసి, ఆయా గ్రామాల సచివాలయాల వద్దకు వెళ్లారు. సాంకేతిక కారణాల వలన పింఛన్ నగదు బ్యాంకు నుంచి రాలేదని సంబంధిత అధికారులు చెప్పడంతో దిగాలు చెందారు. ఉన్నత స్థాయి అధికారులు చొరవ తీసుకొని తమకు పింఛన్ అందేలా చూడాలాని వారు కోరుతున్నారు. ఈ విషయమై సంబేపల్లె ఎంపీడీఓ రామచంద్రను వివరణ కోరగా బ్యాంకులో టెక్నికల్ సమస్య ఉందని, వెంటనే బ్యాంకు అధికారులతో సంప్రదించి పింఛన్ అందజేస్తామని వివరణ ఇచ్చారు.
నేటి నుంచి
కేంద్రమంత్రి పర్యటన
కడప సెవెన్‌రోడ్స్: కేంద్ర ప్రభుత్వం ఆకాంక్షిత జిల్లాగా గుర్తించిన కడపలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాల పురోగతిని సమీక్షించేందుకు కేంద్ర శాస్త్ర సాంకేతికశాఖ మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ గురువారం నుంచి మూడు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్నారు. బుధవారం రాత్రే ఆయన కడపకు చేరుకున్నారు. 2018లో నాటి ప్రభుత్వం దేశంలో 112 జిల్లాలను ఆకాంక్షిత జిల్లాలుగా గుర్తించింది. అందులో కడప కూడా ఉంది. సామాజిక, ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయాలన్నది ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా జిల్లాల మధ్య పోటీ ఏర్పాటు చేసి ర్యాంకింగ్స్ జారీ చేస్తారు. ముఖ్యంగా వైద్యం, పౌష్టికాహారం, విద్య, వ్యవసాయం, జల వనరులు, ఆర్థికం, నైపుణాభివృద్ధి, మౌలిక సదుపాయాలు వంటి అంశాలపై కేంద్రీకరిస్తారు. యాస్పిరేషనల్ బ్లాక్ ప్రోగామ్ కింద జిల్లాలో జమ్మలమడుగు, చింతకొమ్మదిన్నె మండలాలు ఎంపికయ్యాయి. హెల్త్ ఇండికేటర్‌లో భాగంగా గర్భిణుల సమస్యలు, బాలింత తల్లుల పోషకాహార సమస్యలు, విద్యకు సంబంధించిన మౌలిక సదుపాయాలు, సాయిల్ హెల్త్‌కార్డులు జారీ, స్వయం సహాయక బృందాలకు బ్యాంకు రుణాలు వంటి అంశాలపై ఈ మండలాల్లో కేంద్రీకరించి వంద శాతం లక్ష్యాలను సాధించాల్సి ఉంటుంది. నిర్ణీత వ్యవధిలో సంతృప్తికర స్థాయిలో లక్ష్యాలను సాధించాలన్నది సంపూర్ణత అభియాన్ ముఖ్య ఉద్దేశ్యం. కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ జిల్లా పర్యటనకు వస్తుండడంతో యంత్రాంగం అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసింది. నిర్దేశిత రంగాల వారీగా జిల్లాలో సాధించిన ప్రగతిని కేంద్ర మంత్రికి వివరించేందుకు ఆయా శాఖల అధికారులు నివేదికలు సిద్దంచేశారు.
నేటి పర్యటన: కేంద్ర మంత్రి గురువారం చింతకొమ్మదిన్నెమండలం నాగిరెడ్డిపల్లె గ్రామాన్ని సందర్శిస్తారు. అక్కడి విలేజ్ హెల్త్ క్లినిక్, అంగన్వాడీ కేంద్రం, వాటర్ కన్జర్వేషన్‌ప్లాంటు వంటివి పరిశీలిస్తారు.అనంతరం జమ్మలమడుగు మండలం మోరగుడి గ్రామానికి వెళ్లి స్వయం సహాయక సంఘాలతో సమావేశమవుతారు.
Comments
Please login to add a commentAdd a comment