కార్పొరేట్‌లకు కట్టబెట్టేందుకే ఏపీఎండీసీలో టెండర్లు
రాయచోటి అర్బన్ : ఏపీఎండీసీని కార్పొరేట్ కంపెనీకి కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు ఆరోపించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏపీఎండీసీలో రూ.5వేల కోట్లు సేకరించేందుకు అడ్వయిజర్ కం మర్చంట్ ట్యాంకర్ కమిటీ ఏర్పాటు చేస్తూ జీఓ నంబర్ 97ను విడుదల చేసిందన్నారు. ఈ కమిటీ ఇచ్చిన ఈ ప్రొక్యూర్‌మెంట్ టెండర్‌ను పరిశీలిస్తే రూ.5వేల కోట్లు సేకరించేందుకు బదులుగా రూ. 500 కోట్ల నష్టం వాటిల్లే విధంగా ఉందన్నారు. సీ,డీ,డబ్ల్యు ఖనిజం రూ.1680కు ఎగుమతి అవుతుంటే ప్రస్తుతం పిలిచిన టెండర్లలో రూ. 1188కే అమ్మేందుకు నిర్ణయించడం దారుణమన్నారు. ఖనిజాన్ని ఎగుమతి చేసే ప్రైవేటు కంపెనీలకు అనుమతులు రద్దుచేసి ప్రభుత్వమే ఎగుమతి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫలితంగా 30వేల కుటుంబాలకు లాభం చేకూరుతుందన్నారు. ఈ టెండర్ల కారణంగా ఇప్పటికే పనిచేస్తున్న 150కి పైగా పల్వరైజింగ్ పరిశ్రమలు, 50కి పైగా రసాయనిక పరిశ్రమలు మూతపడతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
పెన్నానదిలో పడి
వృద్ధురాలి మృతి
ప్రొద్దుటూరు క్రైం : స్థానిక మోడంపల్లెకు చెందిన బెల్లంకొండ దస్తగిరమ్మ (68) పోట్లదుర్తి సమీపంలోని పెన్నానదిలో పడి మృతి చెందింది. పోలీసుల వివరాల మేరకు.. మతిస్థిమితం సరిగా లేని దస్తగిరమ్మ ఇంటి నుంచి వెళ్లిపోవడంతో ఈ నెల 2న టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. ఆమె మృతదేహం పెన్నానదిలో కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు
Comments
Please login to add a commentAdd a comment