అంగన్‌వాడీ కేంద్రాల అద్దెలు చెల్లించాలి
రాయచోటి అర్బన్ : రాయచోటి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్‌వాడీ కేంద్రాల 9 నెలల అద్దె బకాయిలు చెల్లించే వరకు పోరాటం చేస్తామని అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం పట్టణంలోని రాయచోటి ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట అంగన్‌వాడీ కార్యకర్తలు ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భాగ్యలక్ష్మి, కోశాధికారి బంగారుపాప మాట్లాడుతూ రాయచోటి ప్రాజెక్టు పరిధిలోని చిన్నమండెం, రాయచోటి, సంబేపల్లె మండలాల్లో అద్దె భవనాల్లో నడుస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలకు 9 నెలలుగా అద్దెను చెల్లించకపోవడం దారుణమ న్నారు. అద్దెభవనాల యజమానులు అద్దె కోసం అంగన్‌వాడీ వర్కర్లపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సెంటర్‌ల నిర్వహణలో భాగంగా కూరగాయలు, గ్యాస్ తదితరాల కొనుగోలు కోసం అప్పులు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ప్రభుత్వం మాత్రం సెంటర్‌ల నిర్వహణకు అవసరమైన బడ్జెట్‌ను పూర్తి స్థాయిలో కేటాయించకుండా కాలయాపన చేయడం తగదన్నారు. బిల్లుల చెల్లింపులో ఐసీడీఎస్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారా? లేక కూటమి ప్రభుత్వం బిల్లుల చెల్లింపునకు తగిన నిధులు విడుదల చేయడం లేదా? అనే అంశంపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ చేయాలన్నారు. వెంటనే బిల్లులు చెల్లించని పక్షంలో ఈ నెల 11వ తేదీన సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ హెచ్చరించారు. రాయ చోటి ఐసీడీఎస్ సీడీపీఓ శశికళ ధర్నానుద్దేశించి మాట్లాడుతూ వెంటనే నాలుగు నెలల పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని, మిగిలినవి సంక్రాంతి తర్వాత చెల్లిస్తామంటూ హామీ ఇవ్వడంతో కార్యకర్తలు ధర్నాను విరమి ంచారు. అనంతరం ఆల్‌ఇండియా ఫెడరేషన్ ఆఫ్ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐసీడీఎస్ రాయచోటి కార్యాలయం ఎదుట కార్యకర్తలు జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో రాయచోటి ప్రాజెక్టు అధ్యక్షురాలు సిద్దమ్మ, నాయకురాళ్లు విజయ, నాగమణి, అరుణ, సబీనా, సుమలత, లక్ష్మీదేవి, రమణమ్మ, జయాంజలి, ఉమతోపాటు పలువురు వర్కర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment