ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
అనాథలైన ఇద్దరు కుమారులు
బి.కొత్తకోట : ఇద్దరు కుమారులతో కలిసి నిద్రించిన తండ్రి ఉదయాన్నే నిద్ర లేచాడు. నిద్రపోతున్న కుమారుడిని లేపి సమయం ఎంతైందని అడిగితే 6.20 గంటలైందని చెప్పగా.. అతను ఇంటి నుంచి వెళ్లిన అరగంటలో తండ్రి ఇకలేరు అన్న కబురు వచ్చింది. బి.కొత్తకోట మండలం గుమ్మసముద్రం పంచాయతీ గుడ్లవారిపల్లెలో సోమవారం ఈ సంఘటన జరిగింది. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గుడ్లవారిపల్లెకు చెందిన సంజీవరాజు(45) కూలి పనులు చేసుకుని పిల్లలను పోషించుకొంటూ జీవిస్తున్నాడు. ఆయన భార్య విజయనిర్మల 15 ఏళ్ల క్రితమే మృతి చెందింది. కుమారులు హరీష్‌కుమార్ రాజు (19) డిగ్రీ చివర సంవత్సరం, లోకేష్ రాజు (17) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. అందరూ ఇంటిలో పడుకోగా ఉదయమే నిద్ర లేచిన సంజీవరాజు.. చిన్న కుమారుడిని నిద్ర లేపి టైం ఎంతైందని అడగ్గా మొబైల్‌లో చూసి 6.20 గంటలైందని చెప్పాడు. తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లిన సంజీవరాజు ఊరి సమీపంలోని వంకలోకి వెళ్లి.. అక్కడ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చెట్టుకుపైన తాడు కట్టి కొమ్మ పైనుంచి మెడకు తాడు బిగించుకుని కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. మృతుడి పాదాలు నేలకు తాకుతున్నాయి. తాడు, మెడ సాగినట్టుగా కనిపిస్తున్నాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడు హరీష్‌కుమార్ రాజు తన తండ్రి సంజీవరాజు నాలుగైదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని, ఈ కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్టు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పసితనంలోనే తల్లి దూరమవగా ఇప్పుడు తండ్రి కూడా తమను వదిలి వెళ్లడంతో.. ఆ ఇద్దరు బిడ్డలు అనాథలయ్యారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment