అనకాపల్లి సరే.. కడప ఉక్కు మాటేమిటి?
జమ్మలమడుగు : అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద అర్సెలర్ మిట్టల్–నిప్సల్ స్టీల్ ఇండియా ఉమ్మడిగా రూ.1,47,162 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఉక్కు ఫ్యాక్టరీకి కావాల్సిన అనుమతులు, కేటాయింపులకు ఉపక్రమించిన కూటమి ప్రభుత్వం కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణంపై స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ఎస్పీ డిగ్రీ కాలేజిలో సీపీఐ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం కార్యదర్శి ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2007 జూన్ 10వతేదీన స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారన్నారు. ఆయన మరణానంతరం 2014లో రాష్ట్ర విభజన జరిగాక కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. 2014లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్ నిర్మాణంపై శ్రద్ధ చూపలేదన్నారు. స్టీల్‌ప్లాంట్ నిర్మాణం కోసం గతంలో నాటి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారన్నారు. ఇప్పుడు ఆయన అనకాపల్లి ఎంపీగా ఆ ప్రాంత వాసులకు మేలు చేకూర్చే ప్రయత్నం చేస్తున్నారని, అలాగే కడప జిల్లాలో కూడా ఉక్కు ఫ్యాక్టరీ కోసం కృషి చేసి జిల్లా వాసుల చిరకాల వాంఛ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఏరియా కార్యదర్శి సుబ్బారెడ్డి, నారాయణ, మనోహర్‌బాబు, లక్ష్మినారాయణ పాల్గొన్నారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర
Comments
Please login to add a commentAdd a comment